ఎగిలివారంగ లేసి
ఆకిట్ల అలుకు జల్లి
సుద్దతో బాగా ముగ్గులేసి
అరుగులను జాజుతో అద్ది అద్ది
ముద్దుగా తీనెలు వెట్టి వెట్టి
ల్యాగలను బర్లను మ్యాతకు ఇడిశి పెట్టి
బాయి కాడికి వోయి బిందెతో లీల్లు దెచ్చి
పిడకతో అగ్గిని అంటువెట్టి పొయ్యి మీద జరంత బువ్వ వండి
పొలం కాడికి వోయె పెనిమిటికి సద్ది కట్టి
పిల్లగాండ్లను బడికి పంపి
అడ్లను దంచి గైండ్ల ఎండుగులు ఎండబోసి
బుక్కుతుంటె కోళ్ళను అదిలించి
అట్ల వోయె రాజవ్వను మందలించి
గట్క దిని గొంత అంబలి దాగి
కలుపు కోతలకు వోయి పొద్దు గూకె దంక కట్టం జేశి
కాల్లీడ్సుకుంట ఇంటికి తిరిగి వచ్చే
ఓ అవ్వా! నువ్వెంత మంచిదానివే!
2 వ్యాఖ్యలు:
మస్తుగున్నదన్నా నీ పాట...
డాక్టర్ సాబ్
మీ కవిత చాన బాగున్నది.
చిన్నప్పటి సంగతులను ఒక్కసారి కండ్ల ముందు నిలబెట్టింది.
మొదట "తెలంగాణా అవ్వ " శీర్షిక చూసి - ఏదో ఓ తెలంగాణా ముసల్దాని గురించి రాసిన కవిత కావచ్చు అనుకున్నాను. తర్వాత అర్ధమయింది అవ్వ అంటే అమ్మ అని. (ముగ్గు బుట్ట వంటి తల ... ఆ అవ్వే మరణిస్తే ఈ పాపం ఎవ్వరిదని ... ప్రభావం వల్ల అవ్వ అంటే ముసల్ది అని మైండ్ ల పడిపోయింది.).
మా నాయిన మా నాయినమ్మను అవ్వా అని పిలిచేవాడు. నేను కూడా మా అమ్మను చిన్నప్పుడు అవ్వ అనే పిలిచేవాన్ని. అన్నం ను బువ్వ అనే వాణ్ని (అవ్వా కావాలి బువ్వా కావాలి సామెత ఇప్పుడు మళ్ళీ గుర్తుకు వస్తోంది.) ఆ తర్వాత ఆంద్ర నాగరికత ప్రభావం తోని ఇరుగు పొరుగు వాళ్ళు నా చేత అవేవో తప్పు పదాలు అయినట్టు బలవంతం గా అవ్వను అమ్మ అని , బువ్వను అన్నం అని అనిపించారు. అట్లా ఆతర్వాత అనేక తెలంగాణా పదాలను చులకనగా భావించి నేను స్వయంగా వదిలించుకున్నాను. ఈ పత్రికలూ, సిన్మాలు, పుస్తకాలు, రేడియో టీవీలు నా భాషను ఇంకా కల్తీ చేసాయి.
ఈ రోజులల్ల ఇంగ్లీష్ తో కల్తీ అయిన తెలుగు కు విలువ ఎక్కువ.... ఉర్దూ తో కల్తీ అయిన తెలుగు ఇజ్జత్ తక్కువ. నా చేత అవ్వ అనడం మాన్పించారు కానీ డాడీ అని పిలవడానికి అలవాటు పడ్డ ఈ కాలపు పిల్లల చేత నాయినా అని పిలిచేలా చేయగలరా ఎవరైనా? చచ్చినా సాధ్యం కాదు. అదేదో తప్పుడు మాట అయినట్టు సిగ్గు పడతారు ఈ కాలం పిల్లలు..
మీ కవిత చదువుతుంటే ప్రతి వాక్యంలో మా అమ్మే (అవ్వే) గుర్తుకొచ్చింది. తను కూడా పొద్దుగాల లేచిన దగ్గర్నుంచి మాకు పక్కలేసి పడుకో బెట్టె వరకు మిషిన్ లెక్కనే పని చేసేది. జీవితంల ఒక్కనాడన్నా సుకపడ్డది లేదు. మేం జెర సంపాదనాపరులం అయ్యే నాటికి తన బాధ్యతలు తీరినట్టు వెళ్ళే పోయింది. మా అమ్మ కష్టం మేం తిన్నం కని మా కష్టం మా అమ్మ తినలేదు. నిజంగా దుక్కమొచ్చింది మీ కవిత చదువుతుంటే ...ఇట్లాంటి స్వచ్చమైన తెలంగాణా జీవితాన్ని ప్రతిబింబించే రచనలు మరిన్ని చేయండి.
Post a Comment