నా గురించి

Thursday, December 31, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు


బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Monday, December 28, 2009

మిత్రుడు ...

మిత్రుడు ఇస్మాయిలు ఒక
చిత్రపు మనిషే ! నవకము చిత్రము మాత్రం !
మంత్రపు మాటలతో మరి
తంత్రుల నెదలోన మీటు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Wednesday, December 23, 2009

స్వరలయలు ( పుస్తక పరిచయం )




రచన : డా. సామల సదాశివ
ప్రచురణ : చెలిమి ఫౌండేషన్
ప్రథమ ముద్రణ : నవంబర్ 2009

ఈ పుస్తకంలో హిందుస్తానీ శాస్త్రీయ, ఉపశాస్త్రీయ సంగీతపు ముచ్చట్లు ఉన్నాయి. ఇవి ఇంతకు ముందు "వార్త" దినపత్రికలో వచ్చాయి వరుసగా. ఈ సంగీత జ్ఞాపకాల ముచ్చట్లు మరికొన్ని ఇదివరకే రెండు పుస్తకాల రూపంలో వచ్చాయి. అవి "మలయమారుతాలు" మరియు "సంగీత శిఖరాలు" .
ఈ "స్వరలయలు" లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి చెందిన వివిధ "ఘరానా "లకు సంబంధించిన వివిధ సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, ఉస్తాద్ అల్లాదియాఖాన్, పండిత్ జగన్నాథ్ బువా పురోహిత్ , పండిత్ విష్ణు దిగంబర్ పలూస్కర్, వారి కుమారుడు డి.వి. పలూస్కర్, ఉస్తాద్ బడే గులాం అలిఖాన్, ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ అమీర్ ఖాన్, స్వరశ్రీ కేసర్‌బాయి కేర్కర్, గంగూబాయి హంగల్, విదుషి హీరాబాయి బరోడేకర్, అన్నపూర్ణా దేవి ( పండిత్ రవి శంకర్ భార్య ), విదుషి మోగూబాయ్ కుర్దీకర్, కిషోరీ అమోణ్‌కర్, పర్వీన్ సుల్తానా, ప్రభా ఆత్రే, పండిత్ జస్‌రాజ్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ( షహనాయి), ఉస్తాద్ విలాయత్ ఖాన్ ( సితార్ )... ఇట్లా ఎందరో సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి. వారు ఎన్ని కష్టాలను, అవమానాలను సహించి సంగీతాన్ని అభ్యసించినారో, ఎలా పాడినారో చదువుతుంటే, అక్కడక్కడ కళ్ళు చెమర్చుతాయి.

ద్రుపద్, ఖయాల్,ఠుమ్రి, దాద్రా, తాన్, ముర్కీ, మీండ్, వంటి ఎన్నో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతపు పారిభాషిక పదాలను మనము ఇందులో చదివి తెలుసుకుంటాము. మారు బిహాగ్, పట్‌దీప్ , యమన్ కల్యాణ్, భైరవి, పూర్వి వంటి ఎన్నో రాగాల గురించి మనము వింటాము.

ఇవే కాక, సినిమా సంగీతానికి చెందిన కె.ఎల్.సైగల్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, సోను నిగం గురించిన ముచ్చట్లు ఉన్నాయి. ఐతే కొన్ని "మలయమారుతాలు" "సంగీత శిఖరాలు" పుస్తకాలలో ఉన్నవి రిపీట్ ఐనాయి. ఇవి ముచ్చట్లు కాబట్టి అవి అలా అవడం సహజమే.
ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

సినిమాలు


పోరీలు పోరల వెనుక
పోరలు పోరీల వెనుక పోవుదు రెపుడున్ !
పోరు తరగతు కెన్నడు
తారల సినిమాకు దప్ప దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )

Tuesday, December 22, 2009

భాగ్యనగరం ఉద్యోగి


మండే ప్రొద్దున రద్దీ
గుండే వీథుల నగరము గుండా వెళుతూ ,
చెండాడుచు ట్రాఫిక్కును
దాడిచె ఆఫీసు చేరె దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Monday, December 21, 2009

నిన్న ఆదివారం సాయంత్రం...

నిన్న ఆదివారం సాయంత్రం, నేను నెక్లస్ రోడ్ లో జరుగుతున్నబుక్ ఫెయిర్ కు వెళ్ళడం జరిగింది. అబ్బో! ఎన్నో స్టాల్స్ ఉన్నాయి అక్కడ. ఇ - తెలుగు స్టాల్ లో తెలుగు వికిపీడియా మిత్రుడు , అంతర్వాహిని బ్లాగు రచయిత రవిచంద్ర గారిని కలవడం నాకు ఆనందం కలిగించింది . అలాగే ఇతర బ్లాగ్మిత్రులు చక్రవర్తి గారు , సుజాత గారు, సతీష్ గార్లు పరిచయమయ్యారు.

Saturday, December 19, 2009

గుట్కా,చిట్కా,మట్కా,జట్కా


గుట్కా నోట్లో నములుతు
చిట్కాలను కొన్ని చదివి చిటికెలు వేస్తూ !
మట్కాలో ఓడి, అలసి
జట్కాలో ఇల్లు చేరె జాఫరు హుస్సేన్.

కొడితే ....


కొడితే సిక్సే కొట్టుము
పుడితే పులిబిడ్డ వోలె పుట్టుము , ధరలో
పడితే కరినే పట్టుము
తడితే సింహాన్ని తట్టు, దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Wednesday, December 16, 2009

పేర్లతో తమాషా !



శల్యుడు - బక్కచిక్కిపోయి ఎముకలు తేలినవాడు

శకుని - శస్త్రచికిత్సతో కుటుంబ నియంత్రణ

సైంధవుడు - టేబుల్ సాల్ట్ కు బదులు సైంధవ లవణము ఉపయోగించువాడు

దుశ్శాసనుడు - శాసన సభల్లో చీరలు లాగువాడు

శిశుపాలుడు - మగ బేబీ సిట్టర్

కర్ణుడు - చెవులాడు

నకులుడు - కులము లేనివాడు

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య


కోవెల వంటి మనసు తెలి
పూవుల వంటి పలుకు, విన మోదము లలరున్
మావుల ప్రసన్న వదనము
దవ్వుల నిలిచిననె చాలు దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )

Monday, December 14, 2009

దువ్వెన


చిక్కులను దీసి జుట్టును చక్కబరచు
పేలు వెలికి దీసి తలకు మేలు జేయు
ఆడువారి కరము నెప్పు డాడు చుండు
వెంట్రుకలు లేని తలలను వెక్కిరించు.

గురువులు - విద్యార్థులు


గురువు లనిన భయభక్తులు
ఎరుగని విద్యార్థులు గల కాలములో -
గరపుట కన్న చదువు , గో
దారిని యీదుటయె సులువు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Sunday, December 13, 2009

ఆదిలాబాద్


గిరులు గిరిజనులు పులులు తరులు ఝరులు
విరులు విషనాగు పెరతేనె విప్పపూలు
పులుగు లెలుగులు తునికాకు మొర్రిపండ్లు
గుంటనక్కలు తోడేళ్ళు కోండ్రిగాళ్ళు

కోళ్ళు కుందేళ్ళు నెమళులు లేళ్ళు తేళ్ళు
పైడికంటెలు గూబలు పావురాళ్ళు
బైరి పక్షులు పాములనారిగాళ్ళు
చిరుత గోరువంక కికి రాచిలుక యెలుక ....

Saturday, December 12, 2009

గిరిజనులు


వ్యధలు, వ్యాధులు అక్కడ మామూలే
నిర్ధనము, నిధనము వారికి కొత్తేం కాదు

వాళ్ల పొట్టలు అక్షరమ్ముక్కలకే కాదు
అన్నం మెతుకులకీ నోచుకోవు

కృత్రిమ వేషాలు వారికి తెలియవు
ప్రకృతి ఒడిలో పెరిగే పసిపాపలు వాళ్లు

శ్రమైక జీవనం ఆశ్రమ జీవితం తప్ప
నాగరిక ప్రపంచం వారికి పట్టదు

అడవులు కొండలే వాళ్లకు ఆటపట్టు
ఆత్మాభిమానమే వారికి ఆయువుపట్టు

Thursday, December 10, 2009

గంధర్వ గాయని


మేను పులకించునటు ; తీగె వణికి నటుల
తీపు తేనియలు చెవుల తాపి నటుల
పసిడి వరవీణ రాగాలు పలికి నటుల
జాజి వికసించి తీవెలు సాగి నటుల

కోకిలల్ గూడి యొకసారె కూసి నటుల
ఝరులు పొంగిన యటుల ; రాల్ గరగు నటుల
ఆలపించిన గాయని అమర గాత్రి
సుస్వరకలిత కలకంఠి సుబ్బులక్ష్మి


నివాళి - రేపు ( డిశంబర్, 11 ) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఐదవ వర్ధంతి సందర్భంగా ... పునః ప్రచురణ

Monday, December 7, 2009

తంతే బూరెల సరసన ...


చెంతనె భార్యా పిల్లలు
స్వంతమునకు కారు మేడ సద్యోగముయున్
ఖాతా దండిగ బ్యాంకులొ
తంతే బూరెల సరసన దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

సాధ్యమా !?


హరివిల్లును త్రుంచాలంటే
విరుగుతుందా !?

కోకిలను పెంచుకోవాలంటే
కుదురుతుందా!?

మైటాసు


సత్యము అసత్య మాయెను
సత్యము 'మైటాసు ' అయ్యె , సంగతి దెలిసెన్
నిత్యము జరిగే మోసము
తథ్యము మన దేశమందు దండం సారూ!

( దండం సారూ!శతకము నుండి )

Sunday, December 6, 2009

ముగురమ్మలు



కలిసున్నకలదు సుఖమని
పలుకును ఏ నీతిగ్రంధ పాదములైనా !
కలిసుండలేరు మరి ముది
తలు ముగ్గురు గూడొకటిగ దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

మగువలా !మజాకా !




మగవాడిని నాకేమని
మగువలతో పరిహసించి మసలుట ఏలా !
మగువలు చేయని పని గల
ద ?గత చరిత్రలు చదివిన ,దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )

Thursday, December 3, 2009

సంధ్యా రాగం









పడమటి తెరపై దినకరుడు చిత్రించిన
తైలవర్ణ చిత్రం - సంధ్య

పల్లెపడుచులు తమ ముంగిళ్ళ లోని
అరుగంచులు ఎర్రని జాజుతో దిద్దే వేళ - సంధ్య

రంగురంగుల చీరలు ధరించి వయ్యారంగా
నడచి వచ్చే ఫాషన్ పరేడ్ వనితే - సంధ్య

దూది పింజల్ని ఎర్రని సిరాలో ముంచి
ఆకాశంలోకి విసిరేశారెవరో !

గూళ్ళకు తిరిగొస్తున్న కొంగల బారు
కాన్వాసుపై చుక్కలుచుక్కలుగా
ఒలికిపడిన తెల్లని రంగు

కొండకొమ్మున వేలాడుతున్న రవిబింబం
ప్రకృతి కాంత ముక్కు పుడకలో
రంగులీనుతున్న పగడం

ఒక్కోరోజు ఒక్కోరకంగా
ముస్తాబవుతున్నది
ఈ సంధ్యా సుందరి.

Wednesday, December 2, 2009

చేతికి బంగరు కడియము ...



చేతికి బంగరు కడియము
కాంతకు పొందిక బిడియము కావలె గాదా !
కోతికి బారెడు వాలము
దాత కెముక లేని చేయి దండం సారూ !

( దండం సారూ !శతకము నుండి )
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago