నా గురించి

Thursday, October 22, 2009

శ్రీ మాతృ వాక్కులు - కాంతి బీజాలు


ఓ చిన్నారులారా ! మీరే ఆశల పునాదులు. మీరే భవిష్యత్తుకు బాటలు.
'అసంభవం' అనే మాటకు అర్థం తెలియని మీరు నిరంతరం జవసత్వాలను నింపుకొని  అభివృద్ధి పథంలో పయనించండి.

   *         *          *

దైవం కొరకే జీవించండి.
దైవం  కొరకే పనిచేయండి.
దైవాన్నే ఆరాధించండి.

 *         *          * 

హృదయంలో నుంచి వినేవాడికే
ఈ సృష్టి సమస్తం  తన దైవత్వాన్ని వినిపిస్తుంది.

 *         *          *  

మన జీవితమంతా ఆ దైవానికే అర్పింపబడిన ప్రార్థన కావాలి

*         *          *  

ఓ ప్రభూ! నా హృదయాన్ని మలినం లేని స్ఫటికంలా ఉంచు.
అప్పుడు అందులో నువ్వే గోచరిస్తావు.

*         *          *  

మనలో ప్రతివారికీ ఒక పాత్ర, ఒక కార్యం,ఒక చోటు నిర్దేశింపబడి ఉంటాయి.

*         *          *  

నిరంతరం జ్వలించే హృదయంతో ముందుకు సాగుదాం.

 *         *          *  

సౌందర్యమా! నువ్వే దైవాన్ని చేరుకొనే నా మార్గానివి.

 *         *          * 

సత్యప్రీతి, జ్ఞానతృష్ణతో సాగే మన జీవితాలను
ఆ సత్యప్రీతి, జ్ఞానతృష్ణలే నడిపించాలి.

 *         *          *  

మన జీవితంలోని అన్ని పరిస్థితులు,అన్ని సంఘటనలు అనుభవైక్యవేద్యంగా మనకు కొత్త పాఠాలు నేర్పాలి.

*         *          *  

నీవు ఆ భగవంతునికి నిజమైన ఉపకరణానివి కావాలంటే, నీవు చేసే పనిలో పరిణతి ఏ మాత్రం తగ్గకూడదు.
 *         *          *  

నీ ఆశయాల జ్వాల ఎంత సూటిగా, తీవ్రంగా ఉండాలంటే అది ఎలాంటి అవాంతరాలనైనా తట్టుకొని నిలబడి ఉండగలగాలి.

 *         *          *  

చిత్తశుద్ధితో చేసే ప్రార్థనలు అంగీకరింపబడుతాయి.

 *         *          * 

లోకులు ఏమి ఆలోచిస్తారు? ఏమి చేస్తారు? ఏమి మాట్లాడుతారు? అన్నది ముఖ్యం కాదు. నీకూ భగవంతునుకీ మధ్య  ఉన్న సంబంధమే ముఖ్యం.

*         *          *  

ఓ ప్రభూ!
నేను నీ ముందు ఒక స్వచ్చమైన తెల్ల కాగితాన్ని. నీవు నీ సంకల్పాన్ని ఎలాంటి
అడ్డు లేకుండా, సాంకర్యం లేకుండా లిఖించు.


*         *          *  

నీవు దేనినైనా పరివర్తింప జేయగల అద్భుతమైన ఇంద్రజాలికుడవు.
వికృతము నుండి సౌందర్యాన్ని, బురద నుండి స్వచ్చమైన నీటిని,
 అజ్ఞానము నుండి జ్ఞానమును,
అహంకారము  నుండి దయనూ సృష్టించ గలవు.

*               *               *

నిజాయతీలోనే నిశ్చయమైన విజయము ఉంది.
నిజాయతీ!  ఓ నిజాయతీ!
నీ నైర్మల్యం ఎంత తీయనైనది.

*               *               *

నీవు దేనినైన  ఆ దైవము నుండి దాచాలని ప్రయత్నిస్తే,
 తప్పకుండా నీవు ముక్కు పగిలేలా నేలపై పడతావు.

*               *               *

గమ్యం లేని జీవితం ఎప్పుడూ దుర్భరమైన జీవితమే.

*               *               *

నీకు శక్తినీ, రక్షణనూ ఇచ్చే సత్యాన్నే ఆశ్రయించు.

*               *               *

కష్టాలకు కూడ కృతజ్ఞతగా ఉండు. అవి భగవంతుని వద్దకు చేర్ఛె దగ్గరి దారులు.

*               *               *

మనము ప్రశాంత మనస్కులమై ఉన్నప్పుడే,
సరియైన పనిని,సరియైన రీతిలో, సరియైన సమయంలో చేయగలుగుతాము.

*               *               *

అలజడిలో శాంతి ,ప్రయత్నంలో ప్రశాంతత, శరణంలో ఆనందం, ఒక మహా జ్వాల వంటి విశ్వాసం -
 ఇవన్నీ నీకు దేవుని ఉనికిని చెప్పకనే చెబుతుంటాయి.

*               *               *



ఎల్లప్పుడూ ఔన్నత్యం కొరకే ప్రయత్నిద్దాం.
మనమెప్పుడూ సాధించిన దానితొ తృప్తిపడవద్దు.

* * *

ఓ నా ప్రియమైన ప్రభూ!
నీ ప్రేమతత్వాన్ని నాకు బోధిస్తూ ఉండు.
* * *

అసత్యానికి దూరంగా ఉండు. నిర్మలమైన ఆత్మప్రకాశంతో జీవించు. అప్పుడు నీవు భగవంతునికి చాలా దగ్గరగా నివసిస్తావు.

* * *

మనము ఒక నిశ్చలమైన మనసుతో ముందుకు సాగాలి. జరగాల్సింది జరుగుతుంది.

* * *

ఎలాంటి ఆపదలోనైనా మనము నిబ్బరంగా ఉండగలుగుతే, పరిష్కారం దానంతట అదే కనబడుతుంది.

* * *

...... పట్టును సడలించకు . ప్రయత్నాలన్నీ వమ్మైనప్పుడే తిరిగి అన్నీ నీకు లభించవచ్చు.

* * *

సూర్యుడు మబ్బుల్ని ఎలా చెల్లాచెదరు చేస్తాడో, అలా చిరునవ్వు కష్టాల్లో అతిక్రమింప జేస్తుంది.

* * *

నువ్వేదైతే చెబుతావో అదే ఎల్లప్పుడూ చెయ్. కాని నీవు చేసేవన్నీ చెప్పడం ఒక్కోసారి విజ్ఞత అనిపించుకోదు.

* * *

ఒక మంచి కార్యాలోచన జరగకుండా గడచిన దినము, ఒక ఆత్మరహితమైన దినము.

* * *

నీవు జీవితాన్ని చిరినవ్వుతో ఆహ్వానిస్తే, జీవితం నిన్ను చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది.

* * *

నిత్య సత్యాన్వేషి అసమగ్రతను, అతిశయోక్తిని, అస్తవ్యస్తతను, అవి ఎంత లేశమాత్రమున్నా సరే అంటుకోకూడదు.

* * *

నిరర్థకపు మాటలతోనే ప్రపంచం చెవిటిదయింది.

* * *

మనము మన ఆలోచలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఒక చెడు తలంపు అతి ప్రమాదకరమైన దొంగ వంటిది.

* * *

శాంతమధురములైన దైవస్మరణలు శ్వేతకపోతాల వంటివి.

* * *

ఈ స్వచ్చత, నైర్మల్యము ఆ దేవుని ప్రభావాన్ని మాత్రమే అంగీకరిస్తాయి.

* * *

అంతరంగంలో దాగిన ప్రశాంతాతతను పట్టుకో. దానిని శరీర కణాల్లోకి చొప్పించు. ప్రశాంతాతత వలననే స్వస్థత చేకూరుతుంది.

* * *

మనం మన మనసులోని అసత్యాలను ఎలా శక్తియుతంగా నిరాకరిస్తామో, అలా శరీరం అస్వస్థతను నిరాకరించాలి.

* * *

అది ఎంత కష్టతరమైన కార్యమైన కానీ, నువ్వు ఉత్తమం అనుకున్న దాన్నే చెయ్.

* * *

అంధకారబంధురమైన, పీడకల వంటి ఈ మాయజగత్తులో, ఆ దైవం తన అస్తిత్వాన్ని అణువణువునా ఏదో రూపంలో ప్రకటిస్తూనే ఉంటుంది.

* * *

సరియైన కార్యాచరణ కొరకు మనం మన శక్తిని,మౌనంలో, కేంద్రీకరణలో సమీకరించుకోవాలి.

* * *

మనం దేని గురించి ఆలోచిస్తుంటామో, అదే మన చుట్టూ ఉంటుంది.

* * *

నీవు ఒకరి గురించి మంచిగా ఆలోచించలేకపోతే, అతని గురించి ఆలోచించడం పూర్తిగా మానివేయడమే ఉత్తమం.

* * *

ఆ భగవంతుడు నీ ఆలోచనలను పూర్తిగా ఆక్రమించుకొను గాక!

* * *

నీ చేతనను వికృతమైన ఆలోచనలతో, అనుభూతులతో మలినం చేసుకోకు. అవి నిన్ను నా రక్షణ నుండి దూరంగా తీసుకొని పోతాయి.

* * *

మానవుడిని క్రూరాత్ముడిగా ఆ దేవుడు సృజించలేదు. మానవుడే తనను తాను దైవం నుండి వేరుపరచుకొని క్రూరాత్ముడిగా మారతాడు.

* * *

కోరికలారా! వెనక్కి వెళ్ళిపొండి. పురోగమించకండి.
ఓ దుష్టబుద్ధీ! ద్వేషభావమా! తిరోగమించండి. పురోగమించకండి.

* * *

అందుకొన్న సంతోషం కన్న, నువ్వు పంచి యిచ్చే సంతోషమే నిన్ను మరింత సంతోషపరుస్తుంది.

* * *

ఇద్దరు వ్యక్తులు తగవులాడుకున్నారు అంటే, తప్పు ఎప్పుడూ ఇద్దరి వైపూ ఉందన్న మాట.

* * *

శత్రువుని చూసి నవ్వే చిరునవ్వు, అతనిని నిరస్త్రుణ్ణి చేస్తుంది.

* * *

సంశయం ప్రమాదకరమైంది; ఆట కాదు. ఆత్మను క్రమక్రమంగా నాశనం చేసే విషబిందువు.

* * *

లేనిది ఉన్నట్టూ, ఉన్నది లేనట్టూ కనిపించే ఈ భ్రాంతి ప్రపంచానికి ఆధారం, నీ దైవికమైన చిరునవ్వే.

* * *

ఇతరుల తప్పులకు కోపగించుకొనే ముందు , మనం మన తప్పులను ముందుగా గుర్తుకు తెచ్చుకోవాలి.

* * *

అసూయ అనేది ప్రాణాంతకమైన విషం. అది ఆత్మ వినాశకారిణి.

* * *

మనలో ఉండే లోపాల్నే మనం ఇతరుల్లో గమనిస్తాము. మన చుట్టూ బురద కనిపిస్తూంది,
అంటే అది మనలోనే ఎక్కడో ఉందన్న మాట.

* * *

అసంతృప్తితో గొణగడం మాను. అలా చేసినప్పుడు ఎన్నో రకాల కుయుక్తులు నీలో ప్రవేశించి నీ పతనానికి దారి తీస్తాయి.

* * *

పురోగామి సామరస్యానికి ముఖ్యమైన ఆటంకం - ఎదుటి వాడిది తప్పు, మనదే ఒప్పు అని ప్రదర్శించాలనే తహతహ.

* * *

ప్రతి హృదయంలోని దైవం ఉనికి , భవిష్యత్తుకు, పరిణామానికీ మూలం.

* * *

ఎంతటి అసత్యమైనా, చివరికి సత్యం సాధించే విజయాన్ని ఆపలేదు.

* * *

ప్రేమించడమంటే స్వంతం చేసుకోవడం కాదు. తనను తాను సమర్పించుకోవడం.

* * *

నడువు ! ముందుకు నడువు ! భయాన్ని, సంకోచాన్ని వదలి ముందుకు నడువు !

* * *

ప్రపంచాన్ని మార్చాలని అనుకొంటే, మొదట నిన్ను నీవు మార్చుకో .

* * *

ఒక పనిని అతని కంటే బాగుగా చేయగలిగితే తప్ప, నీకు ఆ వ్యక్తిని గూర్చి అంచనా వేసే, నిర్ణయించే అధికారం లేదు.

* * *

* * *

పిరికితనం అహంభావానికి ప్రతీక. నీవు పిరికితనంతో ఉన్నావంటే , దానర్థం నీవు నీ నిజాయితీ కంటే, నీవు నీపై ఇతరుల అభిప్రాయాలకు ప్రాముఖ్యత నిస్తున్నావని.
* * *

నిన్ను నిన్నుగా ప్రేమించి,నిన్ను మరొక విధంగా ఉండమని కోరని వాడే నీకు నిజమైన స్నేహితుడు.
* * *

స్నేహితులవాలంటే, కలిసి హాయిగా నవ్వుకోవడం కంటే మంచి మార్గం లేదు.
* * *

దేవునిపై నమ్మకం, మరియు ఆయన విజయం పై గల అచంచల విశ్వాసమే అసలైన విశ్వాసం.
* * *

మనం ఆ ప్రభువు యొక్క సాహస వీరులమని అనుకుంటే, ఆయన మహిమ ప్రపంచం అంతటా వ్యాపిస్తుంది.
* * *

సరియైన సమాచారం దొరకనప్పుడు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంత మనస్కులమై ఉండడం మేలు.
* * *

లేని కష్టాలను ఊహించుకోకు. అది సమస్యలను ఆహ్వానిస్తుందే తప్ప, అధిగమించడానికి సహాయపడదు.
* * *

ప్రతి వస్తువులోను, ప్రతి ప్రాణిలోను, పిల్లతెమ్మెరలోను, జ్వలించే సూర్యుడిలోను నిన్ను నేను దర్శిస్తున్నాను.
* * *

ఎట్టి పరిస్థుతులలోనూ, సత్యం కోసం తన శాయశక్తులా వ్యతిరేక శక్తులతో పోరాతాం సలిపే వాడే నిజమైన ధీరుడు.
* * *

ఓ ప్రభూ ! నన్ను నీ యొక్క వెలుగును యథాతధంగా, వికృతం చేయకుండా ప్రసరించే ఒక స్వచ్చమైన స్ఫటికం లా ఉంచు.
* * *

ఎందుకు నీవు దైవాన్ని తెలుసుకోలేవు ? ఆయన నీ హృదయంలో నే ఉన్నాడు.
* * *

ఓ ప్రభూ ! నన్ను నీవైపు సూటిగా నడిపించే చిత్తశుద్ధిని ప్రసాదించు.
* * *

తిరిగి చూడకు ! నీ గమ్యం వైపే దృష్టిని సారించు. అప్పుడు నీవు తప్పకుండా అభివృద్ధిని సాధిస్తావు.
* * *

వీరుడు దేనికీ భయపడడు. దేనినీ లెఖ్ఖ చేయడు. తన పట్టును అసలే విడువడు.
* * *

నిజాయితీకి గొప్ప శత్రువులు ప్రాముఖ్యతల హెచ్చుతగ్గులు ( భౌతికంగా కానీ, ప్రాణికంగా కానీ, మానసికంగా కానీ ) , పూర్వ నిశ్చితాభిప్రాయాలు - - వీటిని ఎలాగైనా అధిగమించాలి.
* * *

దృఢనిశ్చయంతో ధైర్యంగా ఉండు. అడ్డంకులన్నీ వాటంతట అవే తొలగిపోతాయి.
* * *

నిద్రించు బాలకా ! నిద్రించి ! ప్రియమైన అమ్మ నీ హృదిలో నిండగా !
లెమ్ము బాలకా ! లెమ్ము ! ప్రియమైన అమ్మ నీ మదిలో నిండగా !
* * *

కార్యాచరణలో కష్టాలు ఎదురైతే, నిజాయితితో ఆత్మావలోకనం గావించు. అప్పుడు నీవు వాటి కారణాలను కనుగొంటావు.
* * *

తన తప్పును తెలుసుకోవడం కంటే గొప్ప వీరోచితమైన పని లేదు.
* * *

ప్రతి నవోదయం ఒక కొత్త అభ్యుదయానికి నాంది.
* * *

చేసే పనిలో ఇష్టం కలగాలంటే, దానిని మరింత బాగుగా చేయడానికి ప్రయత్నిస్తుండాలి.
* * *

నీ జీవితంలో నీకు ఒక కష్టం ఎదురైతే, అది భగవంతుని వరంగా భావించాలి. అప్పుడు అది నీకు వరంగా మారుతుంది.
* * *

ప్రతిరోజు మనం అసంబద్ధతలను, అజ్ఞానాన్ని, దోషాల్ని జయించడానికి సిద్ధం కావాలి.
* * *

అభివృద్ధి పథంలో సాగనప్పుడు జీవితం మీద విసుగు పుడుటుంది.
* * *

ఈ రోజు సాధించలేనిది నీవు రేపు తప్పకుండా సాధిస్తావు. దృఢ నిశ్చయంతో ఉండు. నీకే విజయం కలుగుతుంది .
* * *

ధైర్యంతో, సహనంతో, అప్రమత్తతతో, చిత్తశుద్దితో, నిజాయితీతో మెలగు. అప్పుడు నీవు అన్ని కష్టాలను ఎదుర్కోగలవు.
* * *

ఒక విషయం కష్టంగా ఉందని వదిలి వేయకూడదు. మీదు మిక్కిలి అందులో విజయం సాధించాలంటే అంతకంటే ఎక్కువ దృఢ నిశ్చయంతో ఉండాలి.
* * *


నటించకు - జీవించు. బాసలు చేయకు - ఆచరించు. కలలు కనకు - సత్యాన్ని సాక్షాత్కరించు.
* * *

విజయం అత్యంత సహనశీలికే. * * *

నిరాడంబరతలోనే గొప్ప సౌందర్య ముంది.
* * *

గొప్ప ప్రభావాల మూలాలు నిశ్శబ్దంలోనే దాగి వుంటాయి.
* * *

ఒక దీపం మరొక దీపాన్ని ఎలా వెలిగిస్తుందో, అలా ధీరోదాత్తులు ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు.
* * *

సమస్యలను సాధించే శక్తి నిట్టూర్పులో కంటె, చిరునవ్వులోనే ఎక్కువగా ఉంది.
* * *

గడ్డు దినాలలో తప్పక దారి చూపెట్టేది విశ్వాసం.
* * *

విశ్వాసంతో ముందుకు సాగుదాం. నమ్మకంగా నిరీక్షిద్దాం.
* * *

ముందుకు నడువు ! ఎప్పుడూ ముందుకు పో ! ఈ సొరంగం చివర వెలుతురు ఉంది. ఈ సమరం తుద విజయం ఉంది.



- సమాప్తం -

ఆంగ్లంలో సంకలనం : విజయ్
తెలుగు అనువాదం : నాగరాజు రవీందర్
ప్రథమ ముద్రణ : ఫిబ్రవరి 2004
ద్వితీయ ముద్రణ : సెప్టెంబర్ 2006
compiled from the writings of The Mother.

0 వ్యాఖ్యలు:

Post a Comment

Powered By Blogger

నెలవారీ పోస్టులు

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    11 years ago