ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తం దూరదేశం పోతూ, తన సామానులన్నీ ఒక ఒంటెపై వేసి ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో ఒక ఎడారి వచ్చింది. వైశ్యుని వద్ద ఆహారం స్వల్పంగా వుంది. ఐదురోజులు గడిచాయి. ఆహారం పూర్తిగా ఐపోయింది. వైశ్యుడు దేవుణ్ణి ప్రార్థించాడు, " దేవుడా ! నాకు ఆహారాన్ని ప్రసాదించు !" పదిరోజులు గడచిపోయాయి. వైశ్యునికి ఆహారం లభించలేదు. తనతో తెచ్చుకున్న నీరు కూడ ఐపోయింది. ఎక్కడా నీటి జాడ లేదు. ఎటు చూచినా ఇసుకే. ఎండ మండిపోతోంది.
వైశ్యుడు దీనంగా " దేవుడా ! నీరు లేదు, అన్నం లేదు. కరుణించి ప్రసాదించు !" అని వేడుకున్నాడు.
మూడు రోజులు గడిచాయి. వైశ్యుడు ఒక్క అడుగు కూడ ముందుకు వేయలేక పోతున్నాడు. అతడు దేవుణ్ణి దూషించడం మొదలు పెట్టాడు. " నీవు భక్తప్రియుడవు గాదు. నీ హృదయం కఠినం. తాగడానికి నీరు కూడ నీ వివ్వడం లేదు. "
ఇంకా మూడు రోజులు గడిచాయి. వైశ్యుని కాళ్ళలో చేతుల్లో శక్తి పూర్తిగా నశించిపోయింది. ఒంటె ఇసుకలో కూలబడి వుంది. దాహంతో అది దీనంగా చుట్టూ పరికిస్తోంది. వైశ్యుని హృదయం కరుణతో నిండిపోయింది. అతడు ఇలా చింతించాడు " నే నింతవరకు నా విషయమే ఆలోచించాను. ఈ ఒంటె నన్ను మోస్తూ నాకు సేవ చేస్తోంది. ఇప్పుడు ఇది మరణావస్థలో వుంది. దేవుడా ! అనుగ్రహించు ! లేకుంటే మా చావు ఖాయం !"
అంతలోనే దూరంగా నీటి శబ్దం వినిపించింది. వైశ్యుడు కష్టంగా లేచి నిలబడి నీటి శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్ళాడు. ఒంటెను కూడ తనతో తీసికెళ్ళాడు. దానికి నీరు త్రాగించి, తను కూడ దాహం తీర్చుకున్నాడు. సమీపంలో కనిపించిన పళ్ళని తిన్నాడు. ఒంటెకు కూడ ఆహారాన్ని అందించాడు.
స్వార్థచింతనా పరుడైన వాడిని దేవుడెప్పుడూ అనుగ్రహించడు. పరహితం అభిలషించే వారిని మాత్రం తప్పక అనుగ్రహిస్తాడు.
మూలం : పరహిత చింతనం
సుగంధ : సంస్కృత కథా సంగ్రహ: నుండి
4 వ్యాఖ్యలు:
చక్కగా చెప్పారండి!
ధన్యవాదములు.
చాలా చక్కగా చెప్పారురవీందర్ గారు ఈ రోజుల్లో చాలా మందికి పరహితం అనే పదం కూడా తెలియడం లేదు
ఔను నిజమే ! రమేశ్ గారూ !
Post a Comment