నా గురించి

Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Wednesday, October 24, 2012

జీవ వైవిధ్యం




ఇన్నాళ్ళూ -  
మనం మన గురించే ఆలోచించాం 
మనతో పాటు యితర ప్రాణులు కొన్ని 
వున్నాయన్న సంగతిని మరిచాం 

చెట్లను నరికివేస్తుంటే 
పులులు నగరాల మీద పడవా మరి ?
వేటాడి పట్టుకొని తింటుంటే 
జంతువులు పక్షులు అంతరించిపోవా మరి ? 
సెల్ ఫోన్ టవర్ల విద్యుత్తరంగాల తాకిడికి  
పిచ్చుకలన్నీ మచ్చుకు లేకుండా పోయాయి 

పొలాలపై చల్లే మందులతో 
చస్తున్నాయి పందులు 
జంతు కళేబరాలను పీక్కుతొనే 
రాబందులు సైతం మరణిస్తున్నాయి
నేడు కళేబరాలు సైతం విషపూరితం ! 

మనం మహానగరాలను నిర్మించుకుంటూ 
కీకారణ్యంలోని ప్రాణులకు 
ఒకింత చోటు లేకుండా చేస్తున్నాం 
ఏవీ ఆ పాలపిట్టలు ! 
ఏవీ ఆ భరద్వాజ పక్షులు ! 
ఏవీ ఆ ఊరబిచ్చుకలు ! 

నాగరికుల ధనకాంక్షకు బలై 
ఆవాసాలను కోల్పోతున్నారు అడవి బిడ్డలు 
పచ్చని చెట్లను కోల్పోయి 
పర్యావరణం తలక్రిందు లవుతోంది 
తోటి ప్రాణులను హింసించిన పాపానికి 
యిప్పుడు మన ఉనికికే ప్రమాదం 
ముంచుకొస్తోంది ! 
ఏదీ పరిష్కారం ? 
కాస్త ఆలోచిద్దాం ! 

‘నేటి నిజం' - సాహితీ కెరటాలు తేది: 11-10-2012 దినపత్రికలో ప్రచురితం 

Tuesday, March 27, 2012

స్వాగతం ! కొత్త సంవత్సరానికి !



ఓ నందన నామ వత్సరమ్మా !
రమ్ము ! అందరికి ఆనంద కారణమ్మువై !
జనులందరికి శుభము గూర్పుము
నందనవనము గావింపుము ఆంధ్రదేశమున్.
ఆమ్ర శాఖాగ్రముల కవికోకిలల్
కవితాగానము సేయుచుండ
నీ కిదే స్వాగతమ్ము రమ్ము !
చైత్రలక్ష్మీ ! వాసంత నందనవై !

ననందల కానంద నిలయమై
రమ్ము ! ఈ శుభవేళ శుభాంగివై !
అందరి ఆశలు వమ్ము చేయక
యిమ్ము శుభముల !
భద్ర తనయా ! నూతన వత్సరమ్మా !
మంచి ప్రభుతను ప్రసాదింపుము కొంచెమైనా !
అతిసంచయేచ్చను వదలింపుము
జనులకు కొంతవరకు
చింతలు లేక ప్రజలెల్ల
సుఖముల నందెదరు గాక !

ఎటులుండునో మున్ముందు యనెడు
సందేహము మాకుంది సుమ్ము !
నిర్భయము గావింపు మమ్ము
అభయ తనూభవవై !
ధరలు నాకసము నంటె,
అవినీతి అంతటా నివ్వటిల్లె !
అంకుశముతో రమ్ము !
ఈ ఉగాది వేళ
ఉగ్ర తనయవై !

కాకు యుగాంతపు సంవత్సరమ్ము !
( కొంతమంది డిశంబరు 21, 2012 "యుగాంతం" అంటున్నారు !? )
కమ్ము నూతనోగాదుల
యుగాది అనవరతము .

{ 25 మార్చి 2012 నాడు హైదరాబాదులో జరిగిన ఓ కవిసమ్మేళనంలో చదవబడిన కవిత }

Monday, April 18, 2011

పట్టుకాయ కవిత్వం

అంతరంగాన్ని పురుగులా తొలిచీ, తొలిచీ
మధించీ, మధనపడీ
కవి హృదయంలో గూడు కట్టుకుంటుంది
పట్టుకాయ కవిత్వం.

తరువాత కవి తన ఆవేశపు వేడి నీటిలో
ముంచి తీసిన పట్టుకాయ కవిత్వాన్ని
పట్టుకొని, ఒక దారం కొసను దొరక బుచ్చుకొని
లాగుతూ పోతాడు.

జిలుగు లీనుతూ సాగిపోతున్న
పట్టుదారం కాస్తా కవిత్వమై కూర్చుంటుంది.

అప్పుడు కవి భాషా మగ్గంపై
పదాల కండెతో ఆసుబోసి
రంగులద్ది, తుది మెరుగులు దిద్ది
ఒక పట్టు కవితాంబరాన్ని నేస్తాడు.

* ఈ కవిత "పాలపిట్ట" మాసపత్రిక ( ఏప్రిల్ '2011 ) లో ప్రచురింపబడింది.

Sunday, February 28, 2010

ప్రెషర్ కుక్కర్


నీళ్ళు సలసలా కాగి
మరిగి ఆవిరైపోయి
కుక్కర్ ఇనుప గోడల్ని
అతలాకుతలం చేస్తూ
చివరికి -
ఒక చిన్న రంధ్రం ద్వారా
బయటికి చిమ్ముకొస్తున్న దృశ్యం

ఒక పీడనంలో నుండి వెలువడ్డ
ఒక ఉచ్చస్థాయి కేక.

పీడనం ఎక్కువైపోతే
ఏదో ఒక రోజు
ప్రెషర్ కుక్కర్ బాంబులా
బద్ధలవడం తప్పదు

Thursday, January 28, 2010

నిశ్శబ్దం


గంట నుంచీ నాతో
మాట్లాడుతున్నావు ఫోన్లో ఏదో !
ఒక్క క్షణం నిశ్శబ్దం -
అప్పుడర్థమైంది ...
నువ్వు చెప్పదలచు కున్నదేమిటో !

Saturday, December 12, 2009

గిరిజనులు


వ్యధలు, వ్యాధులు అక్కడ మామూలే
నిర్ధనము, నిధనము వారికి కొత్తేం కాదు

వాళ్ల పొట్టలు అక్షరమ్ముక్కలకే కాదు
అన్నం మెతుకులకీ నోచుకోవు

కృత్రిమ వేషాలు వారికి తెలియవు
ప్రకృతి ఒడిలో పెరిగే పసిపాపలు వాళ్లు

శ్రమైక జీవనం ఆశ్రమ జీవితం తప్ప
నాగరిక ప్రపంచం వారికి పట్టదు

అడవులు కొండలే వాళ్లకు ఆటపట్టు
ఆత్మాభిమానమే వారికి ఆయువుపట్టు

Thursday, December 3, 2009

సంధ్యా రాగం









పడమటి తెరపై దినకరుడు చిత్రించిన
తైలవర్ణ చిత్రం - సంధ్య

పల్లెపడుచులు తమ ముంగిళ్ళ లోని
అరుగంచులు ఎర్రని జాజుతో దిద్దే వేళ - సంధ్య

రంగురంగుల చీరలు ధరించి వయ్యారంగా
నడచి వచ్చే ఫాషన్ పరేడ్ వనితే - సంధ్య

దూది పింజల్ని ఎర్రని సిరాలో ముంచి
ఆకాశంలోకి విసిరేశారెవరో !

గూళ్ళకు తిరిగొస్తున్న కొంగల బారు
కాన్వాసుపై చుక్కలుచుక్కలుగా
ఒలికిపడిన తెల్లని రంగు

కొండకొమ్మున వేలాడుతున్న రవిబింబం
ప్రకృతి కాంత ముక్కు పుడకలో
రంగులీనుతున్న పగడం

ఒక్కోరోజు ఒక్కోరకంగా
ముస్తాబవుతున్నది
ఈ సంధ్యా సుందరి.

Monday, November 30, 2009

సృష్టి


ముత్యం -
చూడడానికి చిన్నగానే ఉంటుంది
కాని ,
ఎంతటి లోతుల్ని ముట్టుకుంటే
అది ముత్యం .
ఎన్ని బడబాగ్నుల్నితట్టుకుంటే
అది ముత్యం .

తెప్ప -
పదిలంగా, నమ్మకంగా
ఏరు దాటిస్తుంది మనిషిని
కాని పాపం !
దానికి తెలియదు ఆవలి తీరం చేరే వరకూ -
తన బ్రతుకు తగలబడి పోనుందని.

ఊసరవెల్లి రంగులు మారుస్తుంది
ఆత్మరక్షణార్థం
మనిషి వేషాలు వేస్తాడు
ఉదర పోషణార్థం

బావిలోని కప్ప కెలా తెలుస్తుంది
సముద్రమంటే ఏమిటో !?
"ఆ ! మహా అంటే ఇంతకు
పది రెట్లుంటుందిలే "
అంటూ పెదవి విరుస్తుంది .

మండ్రగబ్బను చూడు !
గర్భం ధరించడం తోనే
మూడుతుంది చావు దానికి
పాపం !
అమ్మతనం తెలియకనే
కన్ను మూస్తుందది

Friday, November 27, 2009

శైశిరాగమనం


శిశిర మరుదెంచె
చలిపులి విజృంభించె
వడవడ వణికించె శీతల పవనమ్ములు ;
ఎండుటాకులు రాలె ముంగిట
కురిసె హిమసమూహములు వేకువ తోడ

మంచు తెరలను చీల్చుచు
వచ్చె మయూఖ రేఖలు
ఘనీభవించె ఝరులు
హిమాన్వితమయ్యె గిరులు
తరు శాఖాగ్రమున విరిసె
నీహారమాలికల్
నిశలు హిమాంశు చంద్రికల తోరణమయ్యె
నవ వసంత వేడుకలకు
నాంది పలికెడిదే శైశిరమ్ము

Monday, November 23, 2009

కరి మబ్బులు


చూస్తుండగానే ఆకాశంలో
కారుమేఘాల ఏనుగుల గుంపొకటి
బయలుదేరింది ఒకదాన్నొకటి తోసుకుంటూ -

అవి తమ చేటచెవుల్ని గట్టిగా
ఊపడంతో చల్లనిగాలి
భూమిపైకి మెల్లగా వేచింది.

వాటి పద ఘట్టనలో నేల పెల్లగించబడి
కమ్మని మట్టివాసన ఒక్కసారి
ముక్కుపుటాలను తాకింది.

అవి ఊడబెరికిన లతలు
నింగిపై తటిల్లతలై మెరిశాయి.

వాటి ఘీంకారాలు ఉరుములై
చెవులను బద్దలు చేశాయి.

తొండాలతో నీళ్ళను కుమ్మరించినట్టు
వాన ధారాపాతంగా కురిసింది.

ఏనుగులు ఒకటి,రెండు గంటలు
స్వైరవిహారం చేసి,
పశ్చిమాద్రి కవతల అడవిలోకి
వెళ్ళిపోయాయి ఒక్కటొక్కటిగా.

ఆకాశం మళ్ళీ నిర్మలంగా తయారైంది.
ఏనుగులు వచ్చిపోయిన జాడే లేదు.

కాని వాటి ఆనవాళ్ళు మాత్రం
రోడ్డు పక్కన మిగిలాయి.

Wednesday, November 11, 2009

కవితాంబరం




అంతరంగాన్ని పురుగులా తొలిచీ, తొలిచీ
మధించీ, మధనపడీ
కవి హృదయంలో గూడు కట్టుకుంటుంది
పట్టుకాయ కవిత్వం.

తరువాత కవి తన ఆవేశపు వేడి నీటిలో
ముంచి తీసిన పట్టుకాయ కవిత్వాన్ని
పట్టుకొని, ఒక దారం కొసను దొరక బుచ్చుకొని
లాగుతూ పోతాడు.

జిలుగు లీనుతూ సాగిపోతున్న
పట్టుదారం కాస్తా కవిత్వమై కూర్చుంటుంది.

అప్పుడు కవి భాషా మగ్గంపై
పదాల కండెతో ఆసుబోసి
రంగులద్ది, తుది మెరుగులు దిద్ది
ఒక పట్టు కవితాంబరాన్ని నేస్తాడు.

Tuesday, November 10, 2009

ఉడ్డీనము




( క్రింది నుండి పైకి చదవాలి )
ది.
యిం
గై పో
కనుమరు
క్రమ క్రమంగా
ఆకాశంలో కెగిరి
ఒక్కసారి గాలిలోకి లేచి
పక్షి తన రెక్కల్ని టపటప లాడించి

Sunday, November 1, 2009

చిన్ననాటి స్నేహితులారా !


గుట్టలవతల
మామిడి చెట్ల నీడన,
గుట్ట కివతల
పిల్లిగుండ్ల కాడ
తిరుగలేదా మనము
కలిసి బడికి వెళ్ళలేదా !

పెచ్చెరువు కట్ట మీద
పొద్దుగూకి పోతుంటె,
పాంపిల్ల ఎదురైతె
జడువలేదా మనము
ఉరికి ఉరికి యిల్లు చేరలేదా !

తేనె తెద్దామని జెప్పి
గుట్టగుండ్లకు బోతె,
పిచ్చికోపమున ఈగ కుట్టలేదా మనను
ముక్కుమీద ముల్లును దించలేదా !

యాసాడ గైన్ దాటి
పొలం గట్లను దాటి
పిక్నిక్కు కని వెళ్ళలేదా మనము
వాగులో యీదులాడలేదా !
చేపపిల్ల నొకదాన్ని పట్టలేదా !

పద్మనాభం సారు
పట్టుబట్టి కూసుంటె
లవకుశుల వేషం
వెయ్యలేదా మనము
గొంతెత్తి పద్యాలు పాడలేదా !

జండావందనము నాడు
పొద్దుగాల్నే లేశి
నాక కడకు నడచి
వెళ్ళలేదా మనము !
జాతీయ గీతము పాడలేదా !

ఎలగందుల ఖిల్లా
నెక్కిచూచిన రోజు
నెత్తుటి గాథలు
చెప్పుకోలేదా మనము !
గతవైభవ చిహ్నాలు
గుర్తు లేవా మనకు !

బాల్యం



ఎంత సుందరమైనదీ బాల్యం
నా కిది ఎంతో అమృత తుల్యం.
ఎంత మధురమైనదీ జీవితం
కలతలు,కష్టాలు తెలియని తనం.

ఏ కట్టుబాట్లు లేని నేను
కొండల్లో తిరుగుతాను
కోనల్లో పలుకుతాను
వర్షంలో తడుస్తాను
వడగళ్ళను యేరుతాను
కోయిల గానాన్ని వింటాను
సెలయేట్లో తానమాడతాను
సాయంత్రం చెరువులో మునిగిపోతున్న
సూర్యుణ్ణి చూస్తూ అలాగే నిలుచుంటాను.

ఏభయాలూ లేని నేను
పాడుకొనేది పచ్చని వరిపొలాల్లో
ఆడుకొనేది అనుభూతుల వలయాల్లో
ఆడిపాడి, అలసి సొలసి
నిద్రించేది అమ్మ ఒడిలో.

ఓ కవీ ! కృష్ణ శాస్త్రీ ! ( ముత్యాల సరాలు )




ఆకులో ఆకువైనావా !
పూవులో పూవువైనావా !
అడవిలోనే దాగినావా !
ఓ కవీ ! కృష్ణ శాస్త్రీ !


ఇరుల గుసగుస తెలుసు నీకూ
కనుల బాసలు తెలుసు నీకూ
పోయినావా అమరలోకం
నీవు ప్రవాసివై !

భావ కవితకు భావి యువతకు
దారి చూపిన దివ్వె నీవే
కొత్త పోకడ పద్యములతో
వ్రాసినది నీవే !

మూగవోయిన గొంతులోనూ
కోటిరాగాల్ పలికినావూ
తీయతేనియ బరువులెన్నో
పాట లోపల నింపుతూ !

అశ్రువొక్కటి జారవిడువని
మనిషి అంటూ ఉండబోవడు
నీదు విషాద గాథలన్ విని
గుండె నీరై కరుగగా !

మరుగు వెన్నెల దారులంబడి
తొలుత గంధర్వ లోకాలకు
వియోగ గీతివై వెళితివా
నీవు ఊర్వశికై !

( దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మదినం ( 1 నవంబర్ ) సందర్భంగా - )

Tuesday, October 27, 2009

గాయపడిన మైదానం




ఉన్మాది చేతిలో ఉసిగొల్పబడిన ఆయుధం
ఉడుకు నెత్తురును రుచి చూచిన వైనం
ఉలిక్కిపడిన ప్రపంచం
ఉవ్వెత్తుగ ఎగసిన కోపానల ప్రభంజనం
యుద్దంలో శత్రువును చంపడం నేరం కాదు
అడవిలో జంతువులను చంపి తినడం
పులికి వినోదం కాదు

కరడు గడుతున్న భావాలు
గురి తప్పుతున్న బాణాలు
మారుతున్న లక్ష్యాలు
ఆడదామని వస్తే రక్తం ఓడాల్సి వచ్చిందేమిటి !
గుండెలో రాయి పడిన మైదానం -
గాయపడిన మైదానం.

( పాకిస్తాన్‌లో మన క్రికెట్ ఆటగాళ్ళపై జరిగిన దాడి గురించి చదివాక )

Monday, October 26, 2009

తెలంగాణ అవ్వ!



ఎగిలివారంగ లేసి
ఆకిట్ల అలుకు జల్లి
సుద్దతో బాగా ముగ్గులేసి
అరుగులను జాజుతో అద్ది అద్ది
ముద్దుగా తీనెలు వెట్టి వెట్టి
ల్యాగలను బర్లను మ్యాతకు ఇడిశి పెట్టి
బాయి కాడికి వోయి బిందెతో లీల్లు దెచ్చి
పిడకతో అగ్గిని అంటువెట్టి పొయ్యి మీద జరంత బువ్వ వండి
పొలం కాడికి వోయె పెనిమిటికి సద్ది కట్టి
పిల్లగాండ్లను బడికి పంపి
అడ్లను దంచి గైండ్ల ఎండుగులు ఎండబోసి
బుక్కుతుంటె కోళ్ళను అదిలించి
అట్ల వోయె రాజవ్వను మందలించి
గట్క దిని గొంత అంబలి దాగి
కలుపు కోతలకు వోయి పొద్దు గూకె దంక కట్టం జేశి
కాల్లీడ్సుకుంట ఇంటికి తిరిగి వచ్చే
ఓ అవ్వా! నువ్వెంత మంచిదానివే!

Wednesday, October 21, 2009

శిథిలాలు


శిథిలాలు
గత వైభవాల చిహ్నాలు.
 శిథిలాలు
వర్తమానపు కటిక చేదు నిజాలు.
శిథిలాలు
మన ప్రాచీన నాగరకతకు ఆనవాళ్ళు.
శిథిలాలు
అశాశ్వతాలకు ప్రతీకలు.
శిథిలాలు
ప్రకృతి స్వాభావికతకు గీటురాళ్ళు.




Sunday, October 18, 2009

నేర్చుకో




పూలను చూసి నేర్చుకో నవ్వడం
తుమ్మెదలను చూసి నేర్చుకో పాడడం
చెట్ల నుండి వంగిన కొమ్మలను
చూసి నేర్చుకో వినమ్రంగా ఉండడం
మలయ మారుతాన్ని చూసి నేర్చుకో
మృదుమధుర భావాల్ని ప్రసరించడం
రవి కిరణాలను చూసి నేర్చుకో
మేలుకొనడం, మేలుకొలపడం
తరులతలను చూసి నేర్చుకో
కలిసిమెలిసి ఉండడం
చేపను చూసి నేర్చుకో
స్వదేశం కోసం గిలగిలలాడడం
శిశిరంలోని చెట్లను చూసి నేర్చుకో
భాధలో కూడా ధైర్యాన్ని వహించడం. 

Wednesday, October 14, 2009

మూడు కాలాలు


వేసవి కాలం వేడి వెలుతురు సూదులను
విరజిమ్మాడు సూర్యుడు.

వానాకాలం నీటి దారాలను పేని భూమిపైకి
వదిలాడు మేఘుడు.

శీతాకాలం మంచు కొరడాలను
ఛెళ్ళు మనిపించాడు గాలిదేవుడు.
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago