నా గురించి

Showing posts with label నా తెలుగు పద్యాలు. Show all posts
Showing posts with label నా తెలుగు పద్యాలు. Show all posts

Friday, December 14, 2012

క్షీరసాగర మథనము

క్షీరసాగర మథనమ్ము జేయ మంద
రగిరి కవ్వమై వాసుకి త్రాడు గాగ
కొండ నెత్తగ విష్ణువు కూర్మ మయ్యె
దేవ దానవుల్ జిలికిరి దినము పగలు

క్రమమునన్ బుట్టె చంద్రుడు కమలవాసి
కామధేనువు చౌదంతి కల్పతరువు
మదిర హాలాహలమ్ములు ; తుదకు బుట్టె
నమృతము సురలు రాక్షసులబ్బుర పడ

గరళమును మ్రింగి గాచె లోకముల నెల్ల
హరుడు ;మోహిని రూపమై యవతరించె
హరియె పంచె నమృతమును సురలు ద్రావ ;
నాంది దేవదానవ పోరు నాటి నుండి.

Sunday, August 12, 2012

మనమున తాళంగలేక ...

సమస్య :

"మనమున తాళంగలేక మామను గోరెన్ ! "

నా పూరణ :

అనఘుడు భీముని వలచిన
దనుజుని కొమరిత హిడింబి ; దండక వన సీ
మ నిదాఘ ఘర్మపీడిత ;
మనమున తాళంగలేక మామను గోరెన్ !

భావము :

భీముని వరించిన హిడింబి, దండకారణ్యంలో చెమటలు పట్టే ఎండ వేడిమికి తాళలేక, మనసులో తన మామగారైన అంటే వాయుదేవుణ్ణి ( చల్ల గాలిని ) కోరుకున్నదని అర్థం.



అసలు దీనికి మూలం - ఒక అవధానంలో సంస్కృతంలో ఇవ్వబడిన ఒక సమస్య:

" స్తనవస్త్రం పరిత్యజ్య వధూ శ్వశుర మిఛ్చతి "

గణపతి శాస్త్రి అనుకుంటా - దీనిని ఇలా పూరించారని చదివాను.

హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా
స్తనవస్త్రం పరిత్యజ్య వధూ శ్వశుర మిఛ్చతి

( హిడింబాయా శ్వశుర : వాయు ఇతి ప్రసిద్ద మస్తి )

Monday, April 25, 2011

సత్య సాయి




అపర భాగీరథుడు సాయి ; అనవరతము
మానవాభ్యుదయమ్ముకై మనిన వాడు,
శాంతి సత్య అహింసల చాటినాడు;
మరణమందిన వాడె యమరు డనదగు.

Monday, April 4, 2011

ఉగాదీ ! కొత్త వత్సరమా !




ఖర నామ వత్సరమ్మా !
అరుగుము ప్రతి యింట నీవు ఆనందముగా !
వరముల దాయివి, సురభివి
కరము శుభములను యొసంగి , కమ్ము శుభ"ఖరా" !

Wednesday, March 24, 2010

శ్రీ రామా !


రామా ! గుణాభిరామా !
రామా ! కోదండ రామ ! రఘుకుల సోమా !
రామా ! శ్రీ రఘు రామా !
రామా ! సీతా సమేత రాఘవ నామా !

Monday, February 15, 2010

సెల్‌ఫోన్ యువత




సెల్లులోనె కళ్ళు చేతిలొ చార్జరు
వాడు యెపుడు మాటలాడు చుండు !
బిల్లు పెరుగుతున్న - బింకమ్ము చూపక
సెల్లులోనె వాడు త్రుళ్ళు చుండు !

Monday, December 28, 2009

మిత్రుడు ...

మిత్రుడు ఇస్మాయిలు ఒక
చిత్రపు మనిషే ! నవకము చిత్రము మాత్రం !
మంత్రపు మాటలతో మరి
తంత్రుల నెదలోన మీటు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Wednesday, December 23, 2009

సినిమాలు


పోరీలు పోరల వెనుక
పోరలు పోరీల వెనుక పోవుదు రెపుడున్ !
పోరు తరగతు కెన్నడు
తారల సినిమాకు దప్ప దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )

Tuesday, December 22, 2009

భాగ్యనగరం ఉద్యోగి


మండే ప్రొద్దున రద్దీ
గుండే వీథుల నగరము గుండా వెళుతూ ,
చెండాడుచు ట్రాఫిక్కును
దాడిచె ఆఫీసు చేరె దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Saturday, December 19, 2009

కొడితే ....


కొడితే సిక్సే కొట్టుము
పుడితే పులిబిడ్డ వోలె పుట్టుము , ధరలో
పడితే కరినే పట్టుము
తడితే సింహాన్ని తట్టు, దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Wednesday, December 16, 2009

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య


కోవెల వంటి మనసు తెలి
పూవుల వంటి పలుకు, విన మోదము లలరున్
మావుల ప్రసన్న వదనము
దవ్వుల నిలిచిననె చాలు దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )

Monday, December 14, 2009

గురువులు - విద్యార్థులు


గురువు లనిన భయభక్తులు
ఎరుగని విద్యార్థులు గల కాలములో -
గరపుట కన్న చదువు , గో
దారిని యీదుటయె సులువు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Sunday, December 13, 2009

ఆదిలాబాద్


గిరులు గిరిజనులు పులులు తరులు ఝరులు
విరులు విషనాగు పెరతేనె విప్పపూలు
పులుగు లెలుగులు తునికాకు మొర్రిపండ్లు
గుంటనక్కలు తోడేళ్ళు కోండ్రిగాళ్ళు

కోళ్ళు కుందేళ్ళు నెమళులు లేళ్ళు తేళ్ళు
పైడికంటెలు గూబలు పావురాళ్ళు
బైరి పక్షులు పాములనారిగాళ్ళు
చిరుత గోరువంక కికి రాచిలుక యెలుక ....

Thursday, December 10, 2009

గంధర్వ గాయని


మేను పులకించునటు ; తీగె వణికి నటుల
తీపు తేనియలు చెవుల తాపి నటుల
పసిడి వరవీణ రాగాలు పలికి నటుల
జాజి వికసించి తీవెలు సాగి నటుల

కోకిలల్ గూడి యొకసారె కూసి నటుల
ఝరులు పొంగిన యటుల ; రాల్ గరగు నటుల
ఆలపించిన గాయని అమర గాత్రి
సుస్వరకలిత కలకంఠి సుబ్బులక్ష్మి


నివాళి - రేపు ( డిశంబర్, 11 ) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఐదవ వర్ధంతి సందర్భంగా ... పునః ప్రచురణ

Monday, December 7, 2009

తంతే బూరెల సరసన ...


చెంతనె భార్యా పిల్లలు
స్వంతమునకు కారు మేడ సద్యోగముయున్
ఖాతా దండిగ బ్యాంకులొ
తంతే బూరెల సరసన దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

మైటాసు


సత్యము అసత్య మాయెను
సత్యము 'మైటాసు ' అయ్యె , సంగతి దెలిసెన్
నిత్యము జరిగే మోసము
తథ్యము మన దేశమందు దండం సారూ!

( దండం సారూ!శతకము నుండి )

Sunday, December 6, 2009

ముగురమ్మలు



కలిసున్నకలదు సుఖమని
పలుకును ఏ నీతిగ్రంధ పాదములైనా !
కలిసుండలేరు మరి ముది
తలు ముగ్గురు గూడొకటిగ దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

మగువలా !మజాకా !




మగవాడిని నాకేమని
మగువలతో పరిహసించి మసలుట ఏలా !
మగువలు చేయని పని గల
ద ?గత చరిత్రలు చదివిన ,దండం సారూ!

( దండం సారూ! శతకము నుండి )

Wednesday, December 2, 2009

చేతికి బంగరు కడియము ...



చేతికి బంగరు కడియము
కాంతకు పొందిక బిడియము కావలె గాదా !
కోతికి బారెడు వాలము
దాత కెముక లేని చేయి దండం సారూ !

( దండం సారూ !శతకము నుండి )

Monday, November 30, 2009

వామ్మో ! ఎన్నికలా !



సూర్య చంద్రుల నెట్లైన చేర వచ్చు
మల్ల యుద్ధాన ఎటులైన గెలువ వచ్చు
అంతరిక్షము కెట్లైన గెంత వచ్చు
గీ ఎలక్షన్ల మాత్రము గెలువ లేము
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago