నా గురించి

Showing posts with label పుస్తక పరిచయాలు - సమీక్షలు. Show all posts
Showing posts with label పుస్తక పరిచయాలు - సమీక్షలు. Show all posts

Sunday, April 29, 2012

సామల సదాశివ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ



ఈ రోజు  "హైదరాబాద్ స్టడీ సర్కిల్ " హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్వనాథ సాహిత్య పీఠం వారు జయంతి త్రైమాసిక పత్రిక - సామల సదాశివ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ముందు మాటలో సంపాదకులు శ్రీ వెలిచాల కొండల రావుగారు, శ్రీ కె. జితేందర్ బాబు గారు "ఈ సంచికను వెలువరించడంలో మేము ఆశించిన లక్ష్యం సదాశివ బహుముఖీనత్వాన్ని ఇంతవరకు తెలియని మన పాఠకులకు తెలియ జెప్పాలని మాత్రమే మా ప్రయత్నం" అని చెప్పుకున్నారు.

ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో ఉర్దూ సాహిత్యాన్ని గురించి, హిందుస్తానీ సంగీతం గురించి శ్రీ సదాశివ వ్రాసిన కొన్ని వ్యాసాలను చేర్చారు. రెండవ భాగంలో సదాశివ సాహిత్యంపై కొందరి ప్రముఖుల అభిప్రాయాలు, సదాశివ వ్రాసిన కొన్ని లేఖలను ప్రచురించారు. ఇక మూడవ భాగంలో సదాశివతో జరిపిన ఇంటర్వ్యూ ; అందులో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రచురించారు. రమణజీవి కవర్ డిజైన్ చేయగా, అన్నవరం శ్రీనివాస్ కవర్ పెయింటింగ్ వేశారు.

కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో శ్రీ బి. నరసింగరావు గారు, శ్రీమతి రావు బాలసరస్వతి గారు, అమ్మంగి వేణుగోపాల్ గారు, ఎలనాగ గారు, నాగరాజు రామస్వామి గారు, వి. ఆర్. విద్యార్థి గారు, దేవిప్రియ మొదలైన వాళ్ళున్నారు."నేనెరిగిన సదాశివ" అనే వ్యాసాన్ని అందించిన రావు బాల సరస్వతి సభాధ్యక్షులు శ్రీ పేర్వారం రాములు మరియు ఇతర పెద్దల కోరిక మేరకు రెండు గీతాల్లోని ( “నిండు పున్నమి పండు వెన్నెలలో "... మరియు "ఆ తోటలో నొకటి ఆరాధనాలయము ".. ) కొన్ని చరణాలు ఆలపించి ఆహుతులను అలరించారు.

Wednesday, December 23, 2009

స్వరలయలు ( పుస్తక పరిచయం )




రచన : డా. సామల సదాశివ
ప్రచురణ : చెలిమి ఫౌండేషన్
ప్రథమ ముద్రణ : నవంబర్ 2009

ఈ పుస్తకంలో హిందుస్తానీ శాస్త్రీయ, ఉపశాస్త్రీయ సంగీతపు ముచ్చట్లు ఉన్నాయి. ఇవి ఇంతకు ముందు "వార్త" దినపత్రికలో వచ్చాయి వరుసగా. ఈ సంగీత జ్ఞాపకాల ముచ్చట్లు మరికొన్ని ఇదివరకే రెండు పుస్తకాల రూపంలో వచ్చాయి. అవి "మలయమారుతాలు" మరియు "సంగీత శిఖరాలు" .
ఈ "స్వరలయలు" లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి చెందిన వివిధ "ఘరానా "లకు సంబంధించిన వివిధ సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి. ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్, ఉస్తాద్ అల్లాదియాఖాన్, పండిత్ జగన్నాథ్ బువా పురోహిత్ , పండిత్ విష్ణు దిగంబర్ పలూస్కర్, వారి కుమారుడు డి.వి. పలూస్కర్, ఉస్తాద్ బడే గులాం అలిఖాన్, ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ అమీర్ ఖాన్, స్వరశ్రీ కేసర్‌బాయి కేర్కర్, గంగూబాయి హంగల్, విదుషి హీరాబాయి బరోడేకర్, అన్నపూర్ణా దేవి ( పండిత్ రవి శంకర్ భార్య ), విదుషి మోగూబాయ్ కుర్దీకర్, కిషోరీ అమోణ్‌కర్, పర్వీన్ సుల్తానా, ప్రభా ఆత్రే, పండిత్ జస్‌రాజ్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ( షహనాయి), ఉస్తాద్ విలాయత్ ఖాన్ ( సితార్ )... ఇట్లా ఎందరో సంగీతకారుల గురించిన సంగతు లున్నాయి. వారు ఎన్ని కష్టాలను, అవమానాలను సహించి సంగీతాన్ని అభ్యసించినారో, ఎలా పాడినారో చదువుతుంటే, అక్కడక్కడ కళ్ళు చెమర్చుతాయి.

ద్రుపద్, ఖయాల్,ఠుమ్రి, దాద్రా, తాన్, ముర్కీ, మీండ్, వంటి ఎన్నో హిందుస్తానీ శాస్త్రీయ సంగీతపు పారిభాషిక పదాలను మనము ఇందులో చదివి తెలుసుకుంటాము. మారు బిహాగ్, పట్‌దీప్ , యమన్ కల్యాణ్, భైరవి, పూర్వి వంటి ఎన్నో రాగాల గురించి మనము వింటాము.

ఇవే కాక, సినిమా సంగీతానికి చెందిన కె.ఎల్.సైగల్, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, సోను నిగం గురించిన ముచ్చట్లు ఉన్నాయి. ఐతే కొన్ని "మలయమారుతాలు" "సంగీత శిఖరాలు" పుస్తకాలలో ఉన్నవి రిపీట్ ఐనాయి. ఇవి ముచ్చట్లు కాబట్టి అవి అలా అవడం సహజమే.
ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago