నా గురించి

Showing posts with label హాస్యం. Show all posts
Showing posts with label హాస్యం. Show all posts

Saturday, December 19, 2009

గుట్కా,చిట్కా,మట్కా,జట్కా


గుట్కా నోట్లో నములుతు
చిట్కాలను కొన్ని చదివి చిటికెలు వేస్తూ !
మట్కాలో ఓడి, అలసి
జట్కాలో ఇల్లు చేరె జాఫరు హుస్సేన్.

Wednesday, December 16, 2009

పేర్లతో తమాషా !



శల్యుడు - బక్కచిక్కిపోయి ఎముకలు తేలినవాడు

శకుని - శస్త్రచికిత్సతో కుటుంబ నియంత్రణ

సైంధవుడు - టేబుల్ సాల్ట్ కు బదులు సైంధవ లవణము ఉపయోగించువాడు

దుశ్శాసనుడు - శాసన సభల్లో చీరలు లాగువాడు

శిశుపాలుడు - మగ బేబీ సిట్టర్

కర్ణుడు - చెవులాడు

నకులుడు - కులము లేనివాడు

Monday, December 14, 2009

దువ్వెన


చిక్కులను దీసి జుట్టును చక్కబరచు
పేలు వెలికి దీసి తలకు మేలు జేయు
ఆడువారి కరము నెప్పు డాడు చుండు
వెంట్రుకలు లేని తలలను వెక్కిరించు.

Monday, November 23, 2009

మర్రిచెట్టు



బహుభార్యావ్రతుడిని మర్రిచెట్టుతో పోల్చవచ్చు. ఎందుకంటే దానికుండేవి ఊడలే, ఈయనగారికి ఉండేవి '*ఊఢ'లే ( కదా!)

*ఊఢ = భార్య

కంట్రాక్టరుకు నిర్వచనం





కంట్రాక్టరు అనెడి వాడు, రోడ్లు, ఆనకట్టలు వట్టి మట్టి మాత్రమే వేసి కట్టును. తర్వాత అవి ఒక్క వానకే మట్టిగొట్టుకొని పోవును. కాని అతని జేబులో నోట్లకట్టలు మాత్రము భద్రముగానే యుండును.
అతడు ఈ విధముగా ప్రజల నోళ్ళలో మట్టి గొట్టుచుండును.

అపాత్ర దానము



భిక్షను పాత్రలో కాకుండా, జోలెలో వేసిన 'అపాత్ర దానము' అందురు.

చెంబు మిత్ర


ఒకాయన కొత్తగా పట్నం నుండి ఒక పల్లెటూరికి ఉద్యోగ రీత్యా, బదిలీ ఐ వచ్చాడు. ఆయన పేరు శంభుమిత్ర .
ఆ వూరిలో పెందరాళే కాలకృత్యాలు తీర్చుకోవాలంటే , ఎవరైనా సరే చెంబులో నీళ్ళు పట్టుకొని ఊరవతలికి వెళ్ళాల్సిందే.
పాపం ! ఎప్పుడూ అలవాటు లేదేమో, అలా అందరు చూస్తుండగా వీథి గుండా చెంబు పుచ్చుకొని ఊరవతలకి వెళ్ళడం శంభుమిత్రకు మహా ఇబ్బందిగా ఉండేది.
ఆ అవస్థ చూసి నవ్వుకొని , ఆయనకు ఆ ఊరి కుర్రకారు పెట్టిన పేరు ," చెంబు మిత్ర. "

Monday, November 2, 2009

రంపపు కోత





ఒక ఊళ్ళో ఒక ఆసామి కొత్తగా తను తెరచిన రంపపు కోత మిల్లుకు మంత్రి గారితో ప్రారంభోత్సవం చేయిస్తున్నాడు.
ఇంతలో ఎవరో ఒకాయన , " సార్ ! మీకీ మిల్లును తెరవాలనే ఐడియా ఎలా వచ్చింది ? " అని ప్రశ్నించాడు.
దానికా ఆసామి " అయ్యా ! ఇది చనిపోయిన నా భార్య జ్ఞాపకార్థం ! " అంటూ సెలవిచ్చాడు.


( నేను వ్రాసిన యీ జోకు ఆంధ్రప్రభ వారపత్రిక - 11 - 1993 లో ప్రచురింపబడింది.)

Saturday, October 17, 2009

లాఫింగ్ గ్యాస్ పద్యాలు



వాతావరణము పొగలతొ
మోతాదును మించ ; కారుమోమున పతి సా
యంతరమున యింటి కరిగె;
అంత తలుపు దీసెవరని యడిగె సతి పతిన్

గున్న యేన్‌గు వంటి చిన్నది గజలక్ష్మి
బక్కపీచు వాడు అక్క మొగుడు
కాకి కంటె నలుపు కామాక్షి పెనిమిటి
దబ్బపండు చాయ సుబ్బి మగడు.

చెవికి పోగు యొకటి చేతికి కడియము
జుట్టు వెనుక దువ్వి కట్టు కట్టి
ఆడదాని వోలె నటునిటు దిరుగు కు
మారుని గని తండ్రి మండి పడెను.

ఉన్నదంత యూడ్చి కన్నకొడుకు కిస్తె
గంగ పాలు జేసె నంగనాచి
పెందరాలె లేచి పేకాట రేసులు
ఆడుచుండు వాడు పాడుగాను

చిల్లిగవ్వ గడన చేయని భర్తను
తరిమికొట్టు భార్య దరికి రాదు
కొత్తచీరను కొని కొనిపోగ మగడిని
ముద్దుజేసి ఆమె మురిసిపోవు

నెత్తినొప్పి కొరకు ఉత్తుత్తి స్కానింగ్సు
ఎముకనొప్పి పెడితె ఎక్సురేలు
దగ్గురొంప పడితె దవఖాన కెళ్ళేవు!
కొంపగోడు లన్ని గుల్ల లగును

ఒకడి నెత్తి మీద నొకడు మసలుచు నుండు
గంప కింద కోళ్ళ గుంపు పగిది
అద్దె ధరలు జూడ నాకాశము నంటు
పట్టణములలోని బ్రతుకు వెరపు

బడిలో సీటుకని మిగుల
పడిగాపులు కాసికాసి ; పదివే ల్చందా
గడితిన్ మా చంటి కొరకు
కడు యిడుము ల్దాపురించె కలికాలమునన్


చెప్రాసిగ పని జేయుచు
సంప్రీతిగ సంతు నెంతొ సాకితివి గదా !
ఏప్రిలు లోనైనా యిక
ఆప్రీషన్ జేసుకొనవె యాదమ్మత్తా!

బాట్నీ క్లాసాబ్సెంటయి
చట్నీ సాంబారు ఇడ్లి జర్దా కిళ్ళీ
పాట్నీ సెంటరులో తిని
మాట్నీ షో కెళ్ళినాము మాష్టరు గారూ!

(నిన్న మీరు క్లాసుకు రాలేదేంటర్రా! అని మాష్టారు స్టూడెంట్సును అడిగినప్పుడు)


Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    12 years ago