ఒకప్పుడు ఒక క్షురకుడు ఉండేవాడు. అతడు ప్రతిదినం రాజమందిరానికి వెళ్ళి, రాజుగారికి ముఖక్షవరం చేసేవాడు. క్షురకుడు మహా శివభక్తుడు. ఉదయాన్నే దైవపూజ చేయకుండా ఏ పనీ మొదలుపెట్టే వాడు కాదు.
ఒకరోజు ఆ మంగలి దైవాన్ని ధ్యానిస్తూ కాలాన్ని పూర్తిగా మరచిపోయాడు. సమయానికి మంగలి రాకపోవడం చూసి, రాజు కోపించి భటులను పిలిచి, త్వరగా ఆ మంగలిని తీసుకురండని ఆజ్ఞాపించాడు. ఇంటికి వచ్చిన భటులను చూసి మంగలి భార్య భయపడి, త్వరగా పూజ గదిలోకి వెళ్ళింది వార్తను చెప్పడానికి. కాని అతడు పూర్తిగా ధ్యానమగ్నుడై ఉండడం చూసి అతని ధ్యానాన్ని భగ్నం చేయడం యిష్టం లేక, తిరిగి వెలుపలికి వచ్చి భటులతో "ఆయన యింట్లో లేరు! వచ్చీరాగానే రాజమందిరానికి పంపిస్తాను " అని చెప్పింది.
అప్పటికే మంగలిపై అసూయాద్వేష మనస్కులైన రాజభటులు రాజుకు జరిగింది విన్నవించి, మంగలి భార్య అబద్దమాడుతోందని చెప్ఫారు.
అది విని రాజు కోపంగా భటులతో "వెంటనే వాడిని తాళ్ళతో కట్టిపడేసి, యిక్కడకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు.భటులు ఆనందంతో నృత్యం చేస్తూ మంగలి యింటి వైపు బయలుదేరారు.
అప్పుడు పరమేశ్వరుడు భక్త సంరక్షణార్థం, తాను మంగలి వేషం ధరించి, రాజమందిరానికి వెళ్ళాడు. అతనిని చూడడంతోనే రాజుకు కోపం ఉపశమించి, ఏమీ అనలేక పోయాడు. మంగలి రూపంలో నున్న భగవానుడు రాజుకు ముఖక్షవరం చేసి, కొంత సుగంధ తైలాన్ని తెప్పించి రాజుగారికి శరీరమర్దనం చేశాడు. అతని హస్తకౌశలం చూసి రాజు ముగ్ధుడైపోయాడు. తైలపాత్రలో మంగలి నాలుగు చేతులతో కనిపించగా, రాజు విస్మిత సమ్మోహితుడై, అతనికి ఎన్నో బంగారు నాణాలను బహూకరించి పంపివేశాడు. వాటిని స్వీకరించి పరమేశ్వరుడు వెలుపలికి వచ్చి అదృశ్యమైనాడు.
ఇంతలో ధ్యానాన్ని చాలించిన మంగలి, తన యింటి వైపు వస్తున్న భటులను గమనించి జరిగిన తప్పిదాన్ని గ్రహించి, వెంటనే రాజప్రాసాదానికి వెళ్ళి తన ఆలస్యాన్ని మన్నించమని రాజును వేడుకున్నాడు.
దాని కారాజు "ఏమయ్యా! ఇప్పుడే గదా నాకు గెడ్డం గీసి వెళ్ళావు. తిరిగి వచ్చి ఎందుకు నన్ను క్షమాపణను వేడుతున్నావు?" అని ప్రశ్నించాడు. " ఏదీ ! నీ చతుర్భుజ రూపం మళ్ళీ ఒకమారు ప్రదర్శించు! చూడాలని వుంది " అని కూడ అన్నాడు.
అది విని మంగలి సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే తన రూపంలో వచ్చి రాజుకు ముఖక్షవరం చేశాడని గ్రహించి, " హే! భగవాన్! నన్ను రాజదండనం నుండి తప్పించడానికే నీవు నా రూపంలో వచ్చి, రాజుకు ముఖక్షవరం, శరీరమర్దనం చేశావు గదా! కాని రాజుకు నీ దర్శనభాగ్యం కలిగించి నాకెందుకు ఆ భాగ్యాన్ని కలిగించలేదు " అని చింతించాడు.
అప్పుడు దయామయుడు ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడై, మంగలి ముందు ప్రత్యక్షమై అతనికి తన దర్శనభాగ్యం కలిగించాడు.
మూలం : సంస్కృత కథానిక " భక్త సేవక: "