నా గురించి

Sunday, November 29, 2009

నా మాట



శ్రమించ మంటుంది పిపీలికం
భరించ మంటుంది అనడ్వాహం

క్రమించ మంటుంది చీమల బారు
ధరించ మంటుంది పువ్వుల పేరు.

వైద్యము వ్యాపారములయె .....


వైద్యము వ్యాపారములయె
సేద్యము చేద్దామనినను చేనులు లేవే !
పద్యము వ్రాసే పనులను
తథ్యము చేపట్టనుంటి దండం సారూ !

( దండం సారూ !శతకము నుండి )

చిత్ర వైచిత్ర్యం


అప్పటి సినిమాను కనము
అప్పటి పాటల నెరుగము ; హాస్యము నైనన్
చొప్ప నమిలి నట్లుండును
దాపరికము లేని సొల్లు , దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Saturday, November 28, 2009

2012 ..... యుగాంతం !?







డిసెంబర్ 21, 2012 నాడు మానవాళి,సమస్త ప్రాణికోటి పూర్తిగా అంతరించిపోనుందా !? ఈ మధ్య వార్తా పత్రికల్లో, టీవీల్లో కనబడుతున్న, వినబడుతున్న సంచలన వార్త యిది. ఐతే ఇందులో ఎంతవరకు నిజముంది ?
కొన్ని కారణాలను, నిజాలను పరిశీలిద్దాం.

1. దక్షిణ అమెరికాలో నివసించే 'మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు.

2. ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.

3. శాస్త్రజ్ఞులు 2012లో అణు రియాక్టర్ ( LHC) లో ఒక గొప్ప అణువిస్ఫోటనం గావించి , విశ్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొనబోతున్నారు. ఈ అణు రియాక్టర్‌ను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే కొన్ని పరీక్షలను జరుపుతున్నారు. ఐతే కొందరు 2012లో జరుపబడే ఈ అణుపరీక్ష వికటించి, సమస్త జంతుజాలం నశించిపోతుందని చెబుతున్నారు.

4. బైబిల్ ప్రకారం 2012లో మంచీ - చెడుల మధ్య ఆఖరిపోరాటం జరగబోతోంది. హిందూ శాస్త్రాలలో కలికి అవతారం గురించి, " మ్లేచ్చ నివహ నిధనే కలయసి కరవాలం; ధూమకేతుమివ కిమపి కరాళం" అని ఉండనే ఉంది.
మరికొందరి అభిప్రాయం ప్రకారం, మానవాళి పూర్తిగా నశించదు. కాని వారిలో ఒక గొప్ప నూతన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. శ్రీ అరబింద్ ఘోష్ కూడా " మనిషి ఏదో ఒకరోజు supramental స్థితిని అందుకోగలుగుతాడు " అని చెప్పారు.

5. అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి 650,000 సంవత్సరాలకొకసారి ఆవులించే ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్స్సరాల వరకు కొనసాగుతుంది.
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

6. ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి 750,000 సంవత్సరాల కొకసారి తమ స్థానాలు మార్చుకుంటాయట ! ఇప్పటికే ధ్రువాలు ఏడాదికి 20 - 30 కిలోమీటర్‌లు ఎడంగా జరుగుతున్నాయట ! అలా క్రమేపీ భూమి చుట్టు ఉన్న అయస్కాంత శక్తి నశించిపోయి , అల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపై సోకి, సర్వ ప్రాణులను నశింప జేస్తాయని ఒక కథనం.

7. 2012లో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనబోతోది. అలా కాని జరిగితే ,అప్పుడు భయంకరమైన భూకంపాలు, సునామీలు సంభవించవచ్చు.

... ఐతే నిజంగా డిసెంబర్ 21,2012 నాడు ప్రళయం రాబోతోoదా !?
ఇది అంతు చిక్కని ప్రశ్న !

Friday, November 27, 2009

శైశిరాగమనం


శిశిర మరుదెంచె
చలిపులి విజృంభించె
వడవడ వణికించె శీతల పవనమ్ములు ;
ఎండుటాకులు రాలె ముంగిట
కురిసె హిమసమూహములు వేకువ తోడ

మంచు తెరలను చీల్చుచు
వచ్చె మయూఖ రేఖలు
ఘనీభవించె ఝరులు
హిమాన్వితమయ్యె గిరులు
తరు శాఖాగ్రమున విరిసె
నీహారమాలికల్
నిశలు హిమాంశు చంద్రికల తోరణమయ్యె
నవ వసంత వేడుకలకు
నాంది పలికెడిదే శైశిరమ్ము

Thursday, November 26, 2009

సమస్యా పూరణం


దత్తపది : బల్లి, పిల్లి,తల్లి,చెల్లి

బల్లిదుడన బలము గలవాడు; సన్న
పిల్లి యనగ సాలెపురుగు; వేల్పు గుజ్జు
తల్లియన గట్లరాయని తనయ - గౌరి ;
చెల్లినది యన కాలము చెల్లెననుట .

అరగదు ఒకడికి...




అరగదు ఒకడికి; మెతుకే
దొరకదు మరియొకడికి; సిరితో వొకడు ,సదా
నిరుపేద మరియొకడు, ఈ
తరతమ భేదములు ఏల!? దండం సారూ !


( దండం సారూ ! శతకము నుండి )

Monday, November 23, 2009

మర్రిచెట్టు



బహుభార్యావ్రతుడిని మర్రిచెట్టుతో పోల్చవచ్చు. ఎందుకంటే దానికుండేవి ఊడలే, ఈయనగారికి ఉండేవి '*ఊఢ'లే ( కదా!)

*ఊఢ = భార్య

కంట్రాక్టరుకు నిర్వచనం





కంట్రాక్టరు అనెడి వాడు, రోడ్లు, ఆనకట్టలు వట్టి మట్టి మాత్రమే వేసి కట్టును. తర్వాత అవి ఒక్క వానకే మట్టిగొట్టుకొని పోవును. కాని అతని జేబులో నోట్లకట్టలు మాత్రము భద్రముగానే యుండును.
అతడు ఈ విధముగా ప్రజల నోళ్ళలో మట్టి గొట్టుచుండును.

అపాత్ర దానము



భిక్షను పాత్రలో కాకుండా, జోలెలో వేసిన 'అపాత్ర దానము' అందురు.

చెంబు మిత్ర


ఒకాయన కొత్తగా పట్నం నుండి ఒక పల్లెటూరికి ఉద్యోగ రీత్యా, బదిలీ ఐ వచ్చాడు. ఆయన పేరు శంభుమిత్ర .
ఆ వూరిలో పెందరాళే కాలకృత్యాలు తీర్చుకోవాలంటే , ఎవరైనా సరే చెంబులో నీళ్ళు పట్టుకొని ఊరవతలికి వెళ్ళాల్సిందే.
పాపం ! ఎప్పుడూ అలవాటు లేదేమో, అలా అందరు చూస్తుండగా వీథి గుండా చెంబు పుచ్చుకొని ఊరవతలకి వెళ్ళడం శంభుమిత్రకు మహా ఇబ్బందిగా ఉండేది.
ఆ అవస్థ చూసి నవ్వుకొని , ఆయనకు ఆ ఊరి కుర్రకారు పెట్టిన పేరు ," చెంబు మిత్ర. "

కరి మబ్బులు


చూస్తుండగానే ఆకాశంలో
కారుమేఘాల ఏనుగుల గుంపొకటి
బయలుదేరింది ఒకదాన్నొకటి తోసుకుంటూ -

అవి తమ చేటచెవుల్ని గట్టిగా
ఊపడంతో చల్లనిగాలి
భూమిపైకి మెల్లగా వేచింది.

వాటి పద ఘట్టనలో నేల పెల్లగించబడి
కమ్మని మట్టివాసన ఒక్కసారి
ముక్కుపుటాలను తాకింది.

అవి ఊడబెరికిన లతలు
నింగిపై తటిల్లతలై మెరిశాయి.

వాటి ఘీంకారాలు ఉరుములై
చెవులను బద్దలు చేశాయి.

తొండాలతో నీళ్ళను కుమ్మరించినట్టు
వాన ధారాపాతంగా కురిసింది.

ఏనుగులు ఒకటి,రెండు గంటలు
స్వైరవిహారం చేసి,
పశ్చిమాద్రి కవతల అడవిలోకి
వెళ్ళిపోయాయి ఒక్కటొక్కటిగా.

ఆకాశం మళ్ళీ నిర్మలంగా తయారైంది.
ఏనుగులు వచ్చిపోయిన జాడే లేదు.

కాని వాటి ఆనవాళ్ళు మాత్రం
రోడ్డు పక్కన మిగిలాయి.

Saturday, November 21, 2009

పిన్నలు ఇద్దరు దాటిన ...




పిన్నలు ఇద్దరు దాటిన
అన్నీ ప్రాబ్లంసె గలుగు అన్నిట కొదవే !
చిన్న కుటుంబపు గృహమం
దన్నము నకు లోటు లేదు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Thursday, November 19, 2009

జీవన మాధుర్యము







జీవనమున మాధుర్యము
స్థావరమున పలు వనరులు సమకూరినచో
జీవితమే ఒక గులాబీ !
తావి విరుల కబ్బినట్లు దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

దానగుణము


మేనుం గోసిచ్చె యొకడు
దానము జేసె సకలమును ధరలో యొకడున్ !
క్షోణిం గలదా మరొకటి
దానగుణము కన్న మిన్న దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Tuesday, November 17, 2009

అన్నమాచార్య


శ్రీనివాసుని కీర్తించు శీకరములు
భక్త జనకోటి హృదయాల భాసురములు
మేటి సంగీత సాహిత్య మేళనములు
అన్నమాచార్య కీర్తన లద్భుతములు.

సారంగా ! ....


సారంగా !
నీ జ్ఞాపకాలతో
నా కళ్ళు అలసిపోయాయి.
మధురమైన నీ సంగమం లేక
క్షణాలు గడవడం దుర్భరంగా ఉంది.

ఆ ఊగిన ఉయ్యాలలు
ఆ రావిచెట్టు నీడ
ముసుగులోని చందమామ
కాళ్ళకు పండిన గోరింటాకు
ఆ స్వప్న జగత్తు ...
అవన్నీ నేడు నాకు కరువైనాయి.

నీతో గడిపిన ఆ రెండు క్షణాలు
సజలమైన నయనాల్లో
నేడు నాకు కనుమరుగైనాయి.
సుఖం స్థానే దుఃఖం
అలసిన నా ఈ రెండు కళ్ళు.

( ముఖేష్ పాడిన హిందీ సినిమా పాట 'సారంగా తేరి యాద్ మే ' కు తెలుగులో )

పాయసము లేని డిన్నరు .....


పాయసము లేని డిన్నరు
వాయసములు లేని ఊరు వ్యర్థము కాదా !
సాయము చేయని మిత్రుడు
దయ్యముతో సమము గాదె ! దండం సారూ !


( దండం సారూ ! శతకము నుండి )

రాతిని నాతిగ జేసి ....



సమస్య :
కోతుల రావించి నటకు కూటమి నెరపెన్ !

పూరణ :
రాతిని నాతిగ జేసి అ
రాతులు, రాక్షసుల జంపి రాముడు యొప్పెన్ !
సీతను వెదకగ నెంచుచు
కోతుల రావించి నటకు కూటమి నెరపెన్ !

Thursday, November 12, 2009

గౌతమ్ ఘోష్

'''గౌతమ్ ఘోష్''' ప్రఖ్యాత భారతీయ సినిమా దర్శకుడు; మంచి ''ఫోటో జర్నలిస్ట్'' కూడా. అతడు 1950 వ సంవత్సరంలో కోల్‌కతా లో జన్మించాడు.

==సినిమా ప్రస్థానం==
గౌతమ్ ఘోష్ కలకత్తా యునివర్సిటీ నుండి పట్టా పొంది, సినిమాలలో ప్రవేశించాడు. ఆయన మొదటి సినిమా- మా భూమి, తెలుగులో తీసింది. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది; ఎన్నో రోజులు తెలుగు నాట ఆడింది. అతని సినిమాలన్నీ సామాజిక స్థితిగతులనే ప్రతిబింబిస్తుంటాయి.

==ముఖ్యమైన సినిమాలు==
* [[మా భూమి]] ( 1979 )
* దఖల్ ( 1981 )
* పార్ ( 1984 )
* అంతర్జలి జాత్రా ( 1987 )
* పద్మ నాదిర్ మఝి ( 1992 )
* పతంగ్ ( 1993 )
* గుడియా ( 1997 )
* అబర్ అరణ్యె ( 2003 )
* యాత్రా ( 2006 )
* కాల్ బేలా ( 2009 )
* సంగెమీల్ సె ములాఖత్ ( షెహనాయ్ విద్వాంసుడు, [[ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్]] పై తీసిన డాక్యుమెంటరీ )

==బయటి లింకులు==

* [http://www.imdb.com/name/nm0315872/ గౌతమ్ ఘోష్ - ఇంటర్నెట్ మూవీ డేటాబేస్]
* [http://www.calcuttaweb.com/cinema/gautamghosh.shtml ప్రొఫైల్]
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    13 years ago