నా గురించి

Wednesday, November 11, 2009

కవితాంబరం




అంతరంగాన్ని పురుగులా తొలిచీ, తొలిచీ
మధించీ, మధనపడీ
కవి హృదయంలో గూడు కట్టుకుంటుంది
పట్టుకాయ కవిత్వం.

తరువాత కవి తన ఆవేశపు వేడి నీటిలో
ముంచి తీసిన పట్టుకాయ కవిత్వాన్ని
పట్టుకొని, ఒక దారం కొసను దొరక బుచ్చుకొని
లాగుతూ పోతాడు.

జిలుగు లీనుతూ సాగిపోతున్న
పట్టుదారం కాస్తా కవిత్వమై కూర్చుంటుంది.

అప్పుడు కవి భాషా మగ్గంపై
పదాల కండెతో ఆసుబోసి
రంగులద్ది, తుది మెరుగులు దిద్ది
ఒక పట్టు కవితాంబరాన్ని నేస్తాడు.

అబ్దుల్ కరీంఖాన్


'''అబ్దుల్ కరీంఖాన్''' లేదా '''ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్''' (నవంబరు 11, (1872 - 1937) , 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు.
==జీవితం==
అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ మరియు
గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద మరియు మామ అబ్దుల్లా ఖాన్ వద్ద
శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా - వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్.
==సంగీత ప్రస్థానం==
మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్ తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై , ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానె అబ్దుల్ కరీంఖాన్‌ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్‌బాయ్ కేర్కర్ కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణె లో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్ లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.

కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్‌ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.

==అబ్దుల్ కరీంఖాన్‌ శిష్యుల్లో అగ్రగణ్యులు==
* సవాయి గంధర్వ
* సురేష్‌బాబు మానె
* హీరాబాయ్ బరోడేకర్ లు.

==వనరులు==
*1. [http://www.itcsra.org/tribute.asp?id=1ITC Sangaata Research Acaademy]


(అబ్దుల్ కరీం ఖాన్ జన్మదినం (నవంబర్ 11 ) సందర్భంగా - )

Tuesday, November 10, 2009

భక్షక భటుడు



రక్షక భటులే చివరకు
భక్షక భటులైరి నేడు, భళిరా పోలీస్ !
శిక్షలు వేసే వాడే
రాక్షస కృత్యములు చేయ, రక్షణ ఏదీ ?!

(ఆదిలాబాదులో, 1997లో "గిరిజన మహిళపై పోలీసు దురాగాతం" కు ప్రతిస్పందించి )

ఉడ్డీనము




( క్రింది నుండి పైకి చదవాలి )
ది.
యిం
గై పో
కనుమరు
క్రమ క్రమంగా
ఆకాశంలో కెగిరి
ఒక్కసారి గాలిలోకి లేచి
పక్షి తన రెక్కల్ని టపటప లాడించి

Monday, November 9, 2009

అనంత పద్మనాభ స్వామి దేవాలయము లోని గోపురము.



ఈ గోపురము అనంత పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణము లో నున్నది. ఈ దేవాలయము వికారాబాద్ సమీపంలో నున్న అనంతగిరి కొండలపై నెలకొని యున్నది.

గాయత్రి మాత దేవాలయము

హిమాయత్ సాగర్ చెరువు

Sunday, November 8, 2009

చెలిమి


తరగని పెన్నిధి స్నేహము
చెరగని చిరునవ్వు చెలిమి ,చేయూతంబే !
ఎరుగదు కపటము ,చింతలు
దరికే రానివ్వదు మరి ! దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Saturday, November 7, 2009

ఇంటర్నెట్


అంతర్వాహిని వలెనే
అంతర్జాలములు యింట ,అంతట వెలసెన్
ఎంత అభివృద్ధి గాంచెను
తంతి తపాలాలు నేడు, దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

గులాం అలీ


తింటే గారెలు తినవలె ;
వింటే ఉర్దూ గజల్సు వినవలె ; క్యాసె
ట్టంటే గులాం అలిదె ; వ
ద్దంటే వినబుద్ధి యౌను దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

భానుప్రియ


తారాపథములలో ఒక
తారాజువ్వై వెలిగిన తారామణి; ఆ
చారువదన భానుప్రియ !
తారలలోనే 'సితార ' దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

Thursday, November 5, 2009

సచిన్ టెండూల్కర్



వండే మ్యాచులలో మన
టెండూల్కర్ చేయుచుండు టెరిఫిక్ బ్యాటింగ్
చెండాడి ఫోర్లు సిక్సులు
దండిగ జేయును పరుగులు దండం సారూ !


( దండం సారూ ! శతకము నుండి )

Wednesday, November 4, 2009

సినారె




గేయము ఆయన నెయ్యమ
మేయము లాయన కవితలు ; మేలిమి రచనల్
ఖాయము నిలిచెడు నుడువుల
దాయి ; అతడె మన సినారె దండం సారూ !



( దండం సారూ ! శతకము నుండి )

Tuesday, November 3, 2009

ఎస్.పి. బాలసుబ్రమణ్యం



ప్రవిమల గంధర్వ స్వరము
నవరస భావము లొలికెడు నవకపు కంఠం ;
భువిలో వెలసిన హూహువు ;
ధవళపు గాత్రుండు బాలు, దండం సారూ !

( దండం సారూ ! శతకము నుండి )

హమ్మింగ్ బర్డ్ -2

Monday, November 2, 2009

రంపపు కోత





ఒక ఊళ్ళో ఒక ఆసామి కొత్తగా తను తెరచిన రంపపు కోత మిల్లుకు మంత్రి గారితో ప్రారంభోత్సవం చేయిస్తున్నాడు.
ఇంతలో ఎవరో ఒకాయన , " సార్ ! మీకీ మిల్లును తెరవాలనే ఐడియా ఎలా వచ్చింది ? " అని ప్రశ్నించాడు.
దానికా ఆసామి " అయ్యా ! ఇది చనిపోయిన నా భార్య జ్ఞాపకార్థం ! " అంటూ సెలవిచ్చాడు.


( నేను వ్రాసిన యీ జోకు ఆంధ్రప్రభ వారపత్రిక - 11 - 1993 లో ప్రచురింపబడింది.)

Sunday, November 1, 2009

విరిసిన వెన్ని పూలు ....



విరిసిన వెన్ని పూలు యిట వేకువ జామున తోటలో గనన్ !
మురిసిన వెన్ని మంచు సుమ మోములు రెమ్మకు ఆకు ఆకునన్ !
తిరిగిన వెన్ని ఝమ్మనుచు తేటుల గుంపులు పూవు పూవుకున్ !
తరిమిన వెన్ని యూహలు అదాటున రేగిన వెన్ని భావముల్ !

చిన్ననాటి స్నేహితులారా !


గుట్టలవతల
మామిడి చెట్ల నీడన,
గుట్ట కివతల
పిల్లిగుండ్ల కాడ
తిరుగలేదా మనము
కలిసి బడికి వెళ్ళలేదా !

పెచ్చెరువు కట్ట మీద
పొద్దుగూకి పోతుంటె,
పాంపిల్ల ఎదురైతె
జడువలేదా మనము
ఉరికి ఉరికి యిల్లు చేరలేదా !

తేనె తెద్దామని జెప్పి
గుట్టగుండ్లకు బోతె,
పిచ్చికోపమున ఈగ కుట్టలేదా మనను
ముక్కుమీద ముల్లును దించలేదా !

యాసాడ గైన్ దాటి
పొలం గట్లను దాటి
పిక్నిక్కు కని వెళ్ళలేదా మనము
వాగులో యీదులాడలేదా !
చేపపిల్ల నొకదాన్ని పట్టలేదా !

పద్మనాభం సారు
పట్టుబట్టి కూసుంటె
లవకుశుల వేషం
వెయ్యలేదా మనము
గొంతెత్తి పద్యాలు పాడలేదా !

జండావందనము నాడు
పొద్దుగాల్నే లేశి
నాక కడకు నడచి
వెళ్ళలేదా మనము !
జాతీయ గీతము పాడలేదా !

ఎలగందుల ఖిల్లా
నెక్కిచూచిన రోజు
నెత్తుటి గాథలు
చెప్పుకోలేదా మనము !
గతవైభవ చిహ్నాలు
గుర్తు లేవా మనకు !

బాల్యం



ఎంత సుందరమైనదీ బాల్యం
నా కిది ఎంతో అమృత తుల్యం.
ఎంత మధురమైనదీ జీవితం
కలతలు,కష్టాలు తెలియని తనం.

ఏ కట్టుబాట్లు లేని నేను
కొండల్లో తిరుగుతాను
కోనల్లో పలుకుతాను
వర్షంలో తడుస్తాను
వడగళ్ళను యేరుతాను
కోయిల గానాన్ని వింటాను
సెలయేట్లో తానమాడతాను
సాయంత్రం చెరువులో మునిగిపోతున్న
సూర్యుణ్ణి చూస్తూ అలాగే నిలుచుంటాను.

ఏభయాలూ లేని నేను
పాడుకొనేది పచ్చని వరిపొలాల్లో
ఆడుకొనేది అనుభూతుల వలయాల్లో
ఆడిపాడి, అలసి సొలసి
నిద్రించేది అమ్మ ఒడిలో.

ఓ కవీ ! కృష్ణ శాస్త్రీ ! ( ముత్యాల సరాలు )




ఆకులో ఆకువైనావా !
పూవులో పూవువైనావా !
అడవిలోనే దాగినావా !
ఓ కవీ ! కృష్ణ శాస్త్రీ !


ఇరుల గుసగుస తెలుసు నీకూ
కనుల బాసలు తెలుసు నీకూ
పోయినావా అమరలోకం
నీవు ప్రవాసివై !

భావ కవితకు భావి యువతకు
దారి చూపిన దివ్వె నీవే
కొత్త పోకడ పద్యములతో
వ్రాసినది నీవే !

మూగవోయిన గొంతులోనూ
కోటిరాగాల్ పలికినావూ
తీయతేనియ బరువులెన్నో
పాట లోపల నింపుతూ !

అశ్రువొక్కటి జారవిడువని
మనిషి అంటూ ఉండబోవడు
నీదు విషాద గాథలన్ విని
గుండె నీరై కరుగగా !

మరుగు వెన్నెల దారులంబడి
తొలుత గంధర్వ లోకాలకు
వియోగ గీతివై వెళితివా
నీవు ఊర్వశికై !

( దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మదినం ( 1 నవంబర్ ) సందర్భంగా - )
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    13 years ago