చూస్తుండగానే ఆకాశంలో
కారుమేఘాల ఏనుగుల గుంపొకటి
బయలుదేరింది ఒకదాన్నొకటి తోసుకుంటూ -
అవి తమ చేటచెవుల్ని గట్టిగా
ఊపడంతో చల్లనిగాలి
భూమిపైకి మెల్లగా వేచింది.
వాటి పద ఘట్టనలో నేల పెల్లగించబడి
కమ్మని మట్టివాసన ఒక్కసారి
ముక్కుపుటాలను తాకింది.
అవి ఊడబెరికిన లతలు
నింగిపై తటిల్లతలై మెరిశాయి.
వాటి ఘీంకారాలు ఉరుములై
చెవులను బద్దలు చేశాయి.
తొండాలతో నీళ్ళను కుమ్మరించినట్టు
వాన ధారాపాతంగా కురిసింది.
ఏనుగులు ఒకటి,రెండు గంటలు
స్వైరవిహారం చేసి,
పశ్చిమాద్రి కవతల అడవిలోకి
వెళ్ళిపోయాయి ఒక్కటొక్కటిగా.
ఆకాశం మళ్ళీ నిర్మలంగా తయారైంది.
ఏనుగులు వచ్చిపోయిన జాడే లేదు.
కాని వాటి ఆనవాళ్ళు మాత్రం
రోడ్డు పక్కన మిగిలాయి.
2 వ్యాఖ్యలు:
తుఫాను భీభత్సాన్ని మదపుటేనుగుల దాడిగా ఫర్ణించడం కొత్తగా వుంది. మీ దండంసారూ శతకం బాగుంది డాక్టరు గారూ..
మీ ప్రశంసకు కృతజ్ఞుడిని కెక్యూబ్ వర్మ గారూ !
Post a Comment