గుట్టలవతల
మామిడి చెట్ల నీడన,
గుట్ట కివతల
పిల్లిగుండ్ల కాడ
తిరుగలేదా మనము
కలిసి బడికి వెళ్ళలేదా !
పెచ్చెరువు కట్ట మీద
పొద్దుగూకి పోతుంటె,
పాంపిల్ల ఎదురైతె
జడువలేదా మనము
ఉరికి ఉరికి యిల్లు చేరలేదా !
తేనె తెద్దామని జెప్పి
గుట్టగుండ్లకు బోతె,
పిచ్చికోపమున ఈగ కుట్టలేదా మనను
ముక్కుమీద ముల్లును దించలేదా !
యాసాడ గైన్ దాటి
పొలం గట్లను దాటి
పిక్నిక్కు కని వెళ్ళలేదా మనము
వాగులో యీదులాడలేదా !
చేపపిల్ల నొకదాన్ని పట్టలేదా !
పద్మనాభం సారు
పట్టుబట్టి కూసుంటె
లవకుశుల వేషం
వెయ్యలేదా మనము
గొంతెత్తి పద్యాలు పాడలేదా !
జండావందనము నాడు
పొద్దుగాల్నే లేశి
నాక కడకు నడచి
వెళ్ళలేదా మనము !
జాతీయ గీతము పాడలేదా !
ఎలగందుల ఖిల్లా
నెక్కిచూచిన రోజు
నెత్తుటి గాథలు
చెప్పుకోలేదా మనము !
గతవైభవ చిహ్నాలు
గుర్తు లేవా మనకు !
2 వ్యాఖ్యలు:
కవిత బాగుంది.
థాంక్స్ శ్రీనివాస్ గుప్తా గారూ ! మీ కంప్యూటర్ చిట్కాలు ఇప్పుడే చూసాను. ఉపయోగకరంగా ఉన్నాయి.
Post a Comment