



డిసెంబర్ 21, 2012 నాడు మానవాళి,సమస్త ప్రాణికోటి పూర్తిగా అంతరించిపోనుందా !? ఈ మధ్య వార్తా పత్రికల్లో, టీవీల్లో కనబడుతున్న, వినబడుతున్న సంచలన వార్త యిది. ఐతే ఇందులో ఎంతవరకు నిజముంది ?
కొన్ని కారణాలను, నిజాలను పరిశీలిద్దాం.
1. దక్షిణ అమెరికాలో నివసించే '
మాయా' తెగల పంచాంగం ప్రకారం డిసెంబర్ 21, 2012 ప్రపంచానికి ఆఖరి రోజు.
2. ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, 2012 లో సౌర తుఫానులు తీవ్ర రూపం దాల్చుతాయి. అవి ఇప్పటికే భూమి, మరికొన్ని గ్రహాలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.
3. శాస్త్రజ్ఞులు 2012లో అణు రియాక్టర్ (
LHC) లో ఒక గొప్ప అణువిస్ఫోటనం గావించి , విశ్వం యొక్క పుట్టు పూర్వోత్తరాలను కనుగొనబోతున్నారు. ఈ అణు రియాక్టర్‌ను ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల భూగర్భంలో 27 కిలోమీటర్ల పొడవున్న సొరంగంలో నెలకొల్పారు. అక్కడ ఇప్పటికే కొన్ని పరీక్షలను జరుపుతున్నారు. ఐతే కొందరు 2012లో జరుపబడే ఈ అణుపరీక్ష వికటించి, సమస్త జంతుజాలం నశించిపోతుందని చెబుతున్నారు.
4. బైబిల్ ప్రకారం 2012లో మంచీ - చెడుల మధ్య ఆఖరిపోరాటం జరగబోతోంది. హిందూ శాస్త్రాలలో కలికి అవతారం గురించి, " మ్లేచ్చ నివహ నిధనే కలయసి కరవాలం; ధూమకేతుమివ కిమపి కరాళం" అని ఉండనే ఉంది.
మరికొందరి అభిప్రాయం ప్రకారం, మానవాళి పూర్తిగా నశించదు. కాని వారిలో ఒక గొప్ప నూతన ఆధ్యాత్మిక మార్పు వస్తుంది. శ్రీ అరబింద్ ఘోష్ కూడా " మనిషి ఏదో ఒకరోజు supramental స్థితిని అందుకోగలుగుతాడు " అని చెప్పారు.
5. అమెరికాలోని
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎప్పుడూ వేడినీటి బుగ్గలను విరజిమ్ముతూ ఉంటుంది. దీనికి కారణం అది సరిగ్గా ఒక అగ్నిపర్వతం మీద నెలకొని ఉంది. ఐతే ఈ అగ్నిపర్వతానికి ప్రతి 650,000 సంవత్సరాలకొకసారి ఆవులించే ఒక చెడ్డ అలవాటు ఉంది. దాని మూలంగా ఆకాశమంతా బూడిదతో కప్పబడి, సూర్యరశ్మి భూమిపై సోకదు. అప్పుడు భూమి పూర్తిగా చల్లబడి, మంచుఖండంలా మారుతుంది. అది అలా 15,000 సంవత్స్సరాల వరకు కొనసాగుతుంది.
యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడుగన రోజురోజుకీ పీడనం పెరుగుతోంది. అది 2012లో పూర్తిస్థాయిలో ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
6. ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి 750,000 సంవత్సరాల కొకసారి తమ స్థానాలు మార్చుకుంటాయట ! ఇప్పటికే ధ్రువాలు ఏడాదికి 20 - 30 కిలోమీటర్‌లు ఎడంగా జరుగుతున్నాయట ! అలా క్రమేపీ భూమి చుట్టు ఉన్న అయస్కాంత శక్తి నశించిపోయి , అల్ట్రా వయొలెట్ కిరణాలు భూమిపై సోకి, సర్వ ప్రాణులను నశింప జేస్తాయని ఒక కథనం.
7. 2012లో ఒక పెద్ద ఉల్క భూమిని ఢీకొనబోతోది. అలా కాని జరిగితే ,అప్పుడు భయంకరమైన భూకంపాలు, సునామీలు సంభవించవచ్చు.
... ఐతే నిజంగా డిసెంబర్ 21,2012 నాడు ప్రళయం రాబోతోoదా !?
ఇది అంతు చిక్కని ప్రశ్న !