Wednesday, January 6, 2010

సవాయి గంధర్వ సంగీత మహోత్సవం


'''సవాయి గంధర్వ సంగీత మహోత్సవం''' : భారతీయ శాస్త్రీయ సంగీత ఉత్సవాల్లో, చాలా ప్రాముఖ్యతను సంతరించుకొన్నవి సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు. "ఆర్య సంగీత ప్రసారక మండలి " ప్రారంభించిన ఈ ఉత్సవాలను పండిట్ భీమ్ సేన్ జోషి, ప్రతి యేటా,
పుణె నగరంలో నిర్వహిస్తాడు. ఈ ఉత్సవం సవాయి గంధర్వ జీవితం, సంగీతపరంగా ఆయన సాధించిన విజయాల జ్ఞాపకార్థంగా నిర్వహించబడుతుంది.
డిశంబరు, 2002 లో ఈ ఉత్సవం స్వర్ణోత్సవాలను జరుపుకొంది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీత చరిత్రలో ఈ ఉత్సవం ఒక ప్రత్యేక గుర్తింపును కలిగివుంది. గత యాభై ఏళ్ళుగా, పుణె నగర సంగీతాభిమానులు, విఖ్యాత హిందుస్తానీ సంగీత కళాకారుల మరపురాని కచేరీలను ఈ ఉత్సవాలో విని ఆనందిస్తున్నారు.

==చరిత్ర==
సవాయి గంధర్వ సంగీత మహోత్సవం, హిందుస్తానీ సంగీత చరిత్రలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నది. భారత స్వాతంత్ర్యానికి పూర్వం, హిందుస్తానీ సంగీతం రాజుల "ఆస్థాన సంగీత విద్వాంసుల సాంప్రదాయం" మూలంగా బ్రతికింది. స్వాతంత్ర్యానంతరం, హిందుస్తానీ సంగీతం భారత్, పాకిస్తాన్ లతో పాటే చీలిపోయి, అటు పాకిస్తాన్, ఇటు భారత దేశం ఎందరో ప్రజ్ఞావంతులయిన సంగీత కళాకారుల్ని కోల్పోయాయి. కొత్త రాజకీయ పరిస్థితుల కనుగుణంగా, ఎలా తమ సంగీతం నిలదొక్కుకుంటుందో అని విచారించి, ఎందరో సంగీత కళాకారులు తమ కళను బ్రతికించుకోవడానికి ఎన్నో సంగీత కచేరీల నిస్తుండేవారు.
ఈ సవాయి గంధర్వ సంగీత మహోత్సవం కళాకారుల నందరినీ సంఘటితంగా, ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలను నిత్యనూతనంగా ప్రవేశపెడుతోంది.

ఈ సంగీతోత్సవాల్లో ఇంతవరకు పాల్గొన్నవర్ధమాన మరియు మేటి కళాకారులు : హీరాబాయి బరోడేకర్, డా. వసంతరావు దేశ్‌పాండె, బేగం అక్తర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, జాకిర్ హుసేన్ (సంగీతకారుడు), సరస్వతి రాణె, ఉస్తాద్ అహ్మద్‌జాన్ తిరఖ్‌వా, కుమార గంధర్వ, కిశోరి అమోంకర్, పండిట్ భీమ్ సేన్ జోషి లు. ఇంకా, అరుణా సాయిరాం, (కర్ణాటక సంగీతం), గణేశ్ కుమరేశ్ లు (వయొలిన్), పండిట్ జస్‌రాజ్, పండిట్ అజయ్ చక్తవర్తి, మాలిని రాజూర్కర్, పండిట్ రాజన్ సాజన్ మిశ్రా లు (గాత్రం), శ్రీనివాస్ జోషి, పండిట్ శివకుమార్ శర్మ (సంతూర్), రోను మజుందార్ (ఫ్లూట్), అనుజ్, స్మృతి మిశ్రా లు (కథక్).

==సాంప్రదాయం==
ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం డిశంబర్, మొదటి రెండు వారాల్లో, మూడు రోజుల పాటు నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా కళాకారులు ఇందులో పాల్గొంటారు. ప్రతి కళాకారుడీకీ, సవాయి గంధర్వ సంగీత మహోత్సవంలో పాల్గొనడం అంటే, ఒక గొప్ప సన్మానంతో కూడుకొన్న అవకాశం. ఈ వేదికపై ఎందరో వర్ధమాన కళాకారులు పరిచయం చేయబడ్డారు. చివరి రోజు ఆఖరున, పండిట్ భీంసేన్ జోషి గాత్రకచేరీ ఉండడం, ఈ ఉత్సవ సాంప్రదాయం. కచేరీ తరువాత అబ్దుల్ కరీంఖాన్ ప్రాశస్త్యానికి తీసుకు వచ్చిన, "భైరవి ఠుమ్రి" రాగం - ''జమునా కే తీర్'' - పండిట్ సవాయి గంధర్వ పాడిన రికార్డును వేయగా, వేలాది శ్రోతలు విని ఆనందిస్తారు.


( రేపటి నుండి, అంటే జనవరి 7 నుండి జనవరి 10, 2010 వరకు పుణె నగరంలో సవాయి గంధర్వ సంగీత మహోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ఈ వ్యాసం పున:ప్రచురణ )

సవాయి గంధర్వ సంగీత మహోత్స వం వెబ్ సైట్

4 వ్యాఖ్యలు:

Rohiniprasad said...

మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.

సుజాత said...

చాలా అద్భుతంగా ఉంది. ఈ ఉత్సవాల గురించి వినడమే కానీ ఒక్కసారి కూడా హాజరై వినే భాగ్యం కలగలేదు. అటువంటి గొప్ప కళాకారులను ఒక్కసారి చూసినా జన్మ ధన్యమే!

ఈ నెల 16 న HICCలో జరగనున్న జాకీర్ హుస్సేన్ తబలా కచేరీకి మాత్రం వెళ్తున్నానండీ! మిస్ కాదల్చుకోలేదు.

నాగరాజు రవీందర్ said...

రోహిణీ ప్రసాద్ గారూ ! ప్రాణహిత వెబ్ పత్రికలో మీరు వ్రాస్తున్న సంగీత వ్యాసాలు క్రమం తప్పకుండా చదువుతున్న వాళ్ళలో నేనొకణ్ణి. మీ "సవాయి గంధర్వ సంగీత మహోత్సవ" అనుభవాలు ఇక్కడ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు.

నాగరాజు రవీందర్ said...

ఈ నెల 16 న HICCలో జాకీర్ హుస్సేన్ తబలా కచేరీక ఉందన్న మాట. థాంక్స్ ! మీ ద్వారా నాకు తెలిసినందుకు.

Post a Comment

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged Can...
    5 years ago