నా గురించి

Saturday, March 31, 2012

గతానుగతికో లోక :




" గతానుగతికో లోక : న కోపి పారమార్థిక :
గంగాసైకత లింగేషు నష్టం మే తామ్రభాజనం "

ఒక భిక్షుక సన్యాసి వుండేవాడు. అతడు ప్రతిదినం తనకు దొరికిన అన్నాన్ని భుజిస్తూ, దానం చేసిన ధనాన్ని ఒక రాగిచెంబులో దాచివుంచేవాడు. అలా కొంత కాలానికి ఆ రాగిచెంబు ధనంతో నిండిపోగానే, అతడు తన చిరకాల వాంఛ ననుసరించి, విశ్వనాథుని దర్శనార్థం కాశీకి ప్రయాణమై, అక్కడికి చేరుకున్నాడు.

అతడు మొదట గంగానదిలో స్నానం చేసి, తరువాత దేవుడిని దర్శించాలనుకున్నాడు. "కాని రాగిచెంబును ఎక్కడ దాచడం !?" ఒడ్డున వుంచితే ఎవడైనా దొంగ దానిని తస్కరిస్తాడేమో నని భయపడి, ఇసుకలో గుంతను త్రవ్వి, అందులో రాగిచెంబును వుంచి, దానిపై ఇసుకను కప్పాడు. " కాని, స్నానం చేసి, ఒడ్డుకు వచ్చిన తరువాత, దాని నెలా గుర్తు పట్టడం !? " అతడు ఆలోచించి ఉపాయంతో, దానిపై ఒక ఇసుక లింగాన్ని తయారుచేసి గుర్తుగా వుంచి, గంగానదిలో స్నానం చేయసాగాడు.

ఇంతలో ఒక భక్తుడు అక్కడికి వచ్చి, ఒడ్డున ఇసుక లింగాన్ని వుంచి, గంగానదిలో స్నానమాడుతున్న సన్యాసిని చూసి, అలా చేయడం అక్కడి కాశీ సాంప్రదాయమేమో అనుకొని, తను కూడ ఒక ఇసుక లింగాన్ని తయారు చేసి ఒడ్డున వుంచి, గంగలో స్నానం చేయసాగాడు. కొద్ది సేపట్లో అక్కడికి చేరుకున్న వేలాది భక్తులు తాము కూడ అలాగే ఒడ్డున ఇసుక లింగాలను వుంచి, గంగానదిలో స్నానం చేయసాగారు.

సన్యాసి స్నానానంతరం ఒడ్డుకు రాగానే, అతనికి కొన్ని వేల ఇసుక లింగాలు దర్శనమిచ్చాయి. అందులో తన రాగిచెంబును వుంచిన ఇసుక లింగాన్ని గుర్తుపట్టలేకపోయాడు. ఆ సన్యాసి చివరకు విచారిస్తూ, ఇలా అన్నాడు.
" గతానుగతికో లోక : న కోపి పారమార్థిక :
గంగాసైకత లింగేషు నష్టం మే తామ్రభాజనం "

ఈ సుభాషితం యొక్క భావం :
లోకం అనుకరిస్తుంది. కాని అందులోని పారమార్థాన్ని గ్రహించదు. అయ్యో ! గంగా తీరపు యీ ఇసుక లింగాలలో నా రాగిచెంబును పోగొట్టుకున్నాను గదా !

Tuesday, March 27, 2012

స్వాగతం ! కొత్త సంవత్సరానికి !



ఓ నందన నామ వత్సరమ్మా !
రమ్ము ! అందరికి ఆనంద కారణమ్మువై !
జనులందరికి శుభము గూర్పుము
నందనవనము గావింపుము ఆంధ్రదేశమున్.
ఆమ్ర శాఖాగ్రముల కవికోకిలల్
కవితాగానము సేయుచుండ
నీ కిదే స్వాగతమ్ము రమ్ము !
చైత్రలక్ష్మీ ! వాసంత నందనవై !

ననందల కానంద నిలయమై
రమ్ము ! ఈ శుభవేళ శుభాంగివై !
అందరి ఆశలు వమ్ము చేయక
యిమ్ము శుభముల !
భద్ర తనయా ! నూతన వత్సరమ్మా !
మంచి ప్రభుతను ప్రసాదింపుము కొంచెమైనా !
అతిసంచయేచ్చను వదలింపుము
జనులకు కొంతవరకు
చింతలు లేక ప్రజలెల్ల
సుఖముల నందెదరు గాక !

ఎటులుండునో మున్ముందు యనెడు
సందేహము మాకుంది సుమ్ము !
నిర్భయము గావింపు మమ్ము
అభయ తనూభవవై !
ధరలు నాకసము నంటె,
అవినీతి అంతటా నివ్వటిల్లె !
అంకుశముతో రమ్ము !
ఈ ఉగాది వేళ
ఉగ్ర తనయవై !

కాకు యుగాంతపు సంవత్సరమ్ము !
( కొంతమంది డిశంబరు 21, 2012 "యుగాంతం" అంటున్నారు !? )
కమ్ము నూతనోగాదుల
యుగాది అనవరతము .

{ 25 మార్చి 2012 నాడు హైదరాబాదులో జరిగిన ఓ కవిసమ్మేళనంలో చదవబడిన కవిత }
Powered By Blogger

నా ఇతర బ్లాగులు

  • Almighty - Almighty - Nagaraju Raveender • Palaparti Indrani The glowing fish At the bottom of the sea The twirling baby Within the womb The blood- tinged C...
    10 years ago